Sadhguruపిల్లల్ని పెంచడం అంటే, ముఖ్యంగా వారిని ప్రభావితం చేయకుండా ఉండడం. మీ తప్పుడు అభిప్రాయాలతో పసివాళ్ల ఆలోచనల్ని ప్రభావితం చేయకుండా ఉండటమే మీరు చేయవలసిన మొట్టమొదటి పని. అవును, మీ పిల్లలపై వారిచుట్టూ ఉండే కపట మనసుల ప్రభావం పడవచ్చు. ఈ ప్రపంచమంతా కుళ్లు కుతంత్రాలతోనే నిండి ఉంది కాబట్టి ఈ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి ప్రభావాల నుంచి మీ పిల్లల్ని మీరు పూర్తిగా దూరంగా ఉంచలేరు.

అయితే ‘’నేనిప్పుడు ఏం చెయ్యాలి? మా పిల్లల చదువు ఎలా ఉండాలి? వాళ్లని నేను ఎలా పెంచాలి? వాళ్లకు మార్గదర్శనం ఎలా చెయ్యాలి?’’ అనే కదా మీ సందేహాలు! ఏమీ లేదు, పిల్లలకి తెలివిగా మసలుకోవడం నేర్పించండి, ప్రజ్ఞతో ఉండేలా ప్రోత్సహించండి. కావలసింది అంతే. ప్రతి జీవికీ తన జీవితాన్ని గడపటానికి కావలసిన తెలివితేటలను ప్రకృతి ఇచ్చింది. ఒక చీమను బాగా అధ్యయనం చేయండి. చీమగా జీవించడానికి కావలసిన తెలివితేటలు అన్నీ దానికి ఇవ్వబడ్డాయి. మీరు చేసే పనులను అది  చేయలేకపోవచ్చు, కానీ చీమగా అది తగిన తెలివితేటల్ని కలిగి ఉంటుంది. ఇలానే అన్ని జీవరాశులకు కూడా. మీకు కూడా, మీ జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి తగినన్ని తెలివి తేటలు ఇవ్వబడ్డాయి.

మీరు మీ జీవితాన్ని పిల్లల ద్వారా జీవించాలనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా పిల్లల్ని నాశనం చేసే విధానం.

అయితే మీ పిల్లలు ‘మీ’ పద్ధతిలో తెలివిగా మసలుకోవాలని మీరు కోరుకోవడమే అసలు సమస్య. మీ ఉద్దేశ్యంలో తెలివి అంటే మీ పిల్లవాడు డాక్టర్‌ అవడమే. అయితే వాడు మంచి వడ్రంగి అయేవాడేమో, కాని మీరు మాత్రం వాడు డాక్టరు కావాలనే కోరుకుంటారు. ఈ దేశానికి డాక్టర్లు చాలా అవసరమనో లేక సమాజంలోని బాధల పట్ల మీకున్న స్పందనతోనో పిల్లవాడు డాక్టరు కావాలన్నది మీ ఉద్దేశ్యం కాదు, వాడు డాక్టరు కావాలనుకోవడం అన్నది మీ మనసులోని ఒక పిచ్చి ఆలోచన. ప్రస్తుత సమాజంలో డాక్టర్లు, ఇంజినీర్లు కావడం అంటే ప్రతిష్ఠ. ‘’నా కొడుకు డాక్టర్‌!’’ అని మీరు చెప్పుకోవాలనుకుంటారు. మీరు మీ జీవితాన్ని పిల్లల ద్వారా జీవించాలనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా పిల్లల్ని నాశనం చేసే విధానం.

మీరు చేయాల్సిందల్లా....పిల్లలు వికసించే వాతావరణాన్ని నెలకొల్పడం 

జీవితంలో మీరు చేసిందే మీ పిల్లలు చేయాలని లేదు. మీరు మీ జీవితంలో ఊహించడానికి కూడా సాహసించని వాటిని మీ పిల్లలు చేసి చూపాలి. మీరు కనీసం ఆలోచన చేయడానికి కూడా భయపడినటువంటి వాటిని, మీ పిల్లలు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం ప్రగతిపథాన నడుస్తుంది, ఉత్తమమైనదేదో అది జరుగుతుంది. కదూ?

ప్రతి పిల్లవాడికీ జీవితాన్ని పూర్తిగా జీవించడానికి తగినన్ని తెలివితేటలు ఉన్నాయి. మీ మూర్ఖత్వం వాడిపై రుద్దకుండా, పిల్లల తెలివితేటలు వికసించేలాగా వారి చుట్టూ ఒక వాతావరణాన్ని నెలకొల్పండి. ఇక వారిని ప్రభావితం చేసే విషయానికి వస్తే, అందుకు వారి టీచర్లు, మిత్రులు ఇలా సమాజంలో చాలామంది ఉన్నారు. వీరందరి ప్రభావం మీ పిల్లలపై పడుతుంది, మీరు దాన్ని ఆపలేరు. అలాగని మీ పిల్లవాడిని ఏకాంతంలో బంధించనూ లేరు, కాని తల్లితండ్రులుగా పిల్లవాడి తెలివితేటలు వికసించడంలో మీరు కీలకపాత్ర వహించగలరు.

అసలు మీ జీవితంలోకి ఒక పిల్లవాడు వచ్చినప్పుడు  అది మీరు వారినుండి  నేర్చుకోవలసిన  సమయం.

పిల్లవాడు పుట్టగానే, వాడికి ఏదో నేర్పేయాలనే భావన మీకు ఉంటే మీరు వాడి భవిష్యత్తును నాశనం చేసేస్తారు. అసలు మీ జీవితంలోకి ఒక పిల్లవాడు వచ్చినప్పుడు  అది మీరు వారినుండి  నేర్చుకోవలసిన  సమయం. ఎందుకంటే మీరు జీవితాన్ని సరిగ్గా గ్రహించక పోవడం వల్ల ఇప్పటికే  చాలా జీవితాన్ని చేజార్చుకున్నారు. కాని పిల్లవాడి విషయానికి వస్తే,  తను ఇప్పుడే జీవితాన్ని కొత్తగా  చవి చూస్తున్నాడు. మీరు కూడా వాడితో కూర్చుని, జీవితాన్ని కొత్తగా చూడండి. మీ పిల్లవాడికి ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని  కల్పించి, ప్రోత్సాహం అందించడమే మీరు చేయవలసింది. ప్రేమపూరిత వాతావరణం కల్పించండి, పిల్లల తెలివితేటలు సహజంగా వాటంతట అవే వికసిస్తాయి.

పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు 

పిల్లలను ప్రేమతో పెంచడం అంటే వారు అడిగినవన్నీ తెచ్చి ఇవ్వడం అని మీరు అనుకుంటారు. మీ పిల్లలను సరిగా గమనిస్తే, వారికి కావలసినవన్నీ తెచ్చి ఇవ్వడం మూర్ఖత్వం అని గ్రహించారా? దానినే మీరు ‘ప్రేమ’ అంటున్నారు. మరి వారిని పెంచడం ఎలా? పిల్లవాడిని ఏ పరిస్థితులలో ఉంచినా, ఆతడు సంతోషంగా ఉండగలగాలి. అవునా? పిల్లవాడిని ఆ విధంగానే పెంచాలి.

మీరు పిల్లవాడిని బాగా పెంచాలంటే, ముందు మీరు సంతోషంగా ఉండాలి. ప్రస్తుతం మీకు సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు. ప్రతిరోజూ మీరు ఇంట్లో భయం, కోపం, ఈర్ష్య చూపుతున్నారు. వీటినే పిల్లలముందు ప్రదర్శిస్తుంటే ఏమవుతుంది? వారూ అవే నేర్చుకుంటారు. మీకు పిల్లలను బాగా పెంచాలనే ఉద్దేశ్యం ఉంటే, మీరు మసలుకునే విధానం మార్చుకోవాలి. మిమ్మల్ని మీరే మార్చుకోలేకపోతే, ఇక మీరు పిల్లల్ని బాగా పెంచే ప్రశ్న ఎక్కడ ఉంటుంది?

ప్రేమాశిస్సులతో,
సద్గురు