ఈ వారం సద్గురు "శివ" అన్న మహత్తరమైన చిన్న కవితని మనతో పంచుకోవడమే గాక, ఆ "శివ" శబ్దానికి ఉన్న ప్రతీకతనీ, దాని అర్థాన్నీ మరింత తరచి చూచి, మన జీవితానికి మూలాధారమైన ప్రమాణాన్ని అందుకుంనేందుకు మనకొక సాధనాన్ని అందిస్తున్నారు.   సృష్టిలో అనేక వర్ణాలు. వీటి అబ్బురపాటులో పడిపోయి, వాటన్నిటికి ఆధారభూతమైన వస్త్రాన్ని (శివుణ్ణి) మనం మరిచిపోకూడదని సద్గురు చెప్తున్నారు.

శివ

 

లింగభేదాలు లేని

ఈ సర్వ దృశ్యమాన జగతిలో

శివుడే

ఇదనీ అదనీ

అతననీ ఆమె అనీ

నర్తిస్తుంటాడు.

బహుళవర్ణసమ్మేళన చిత్రహేలలో

ఆధారభూతమైన వస్త్రాన్ని మరిచిపోవద్దు.

 

ప్రతి వ్యక్తీ తనకున్న సున్నితమైన అవగాహనా పరిథిలో మాత్రమే జీవితాన్ని అనుభూతి చెందగలుగుతాడు. కొందరు ఆహారం తీసుకోవడంలో ఆనందాన్ని అనుభవించగలిగితే, మరికొందరు, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడంలో, కొందరు సంగీతంలో, లలిత కళలలో, లేదా జీవితంలోని మరొక పార్శ్వాన్ని ప్రదర్శించడంలో ఆనందాన్ని అనుభూతి చెందుతారు. కానీ, మనిషికి ప్రాకృతిక లక్షణం రిత్యా, బాహ్యంగా పొందే ఆనందం ఏదైనా సరే ఎక్కువకాలం కొనసాగించలేరు. సకల జీవనానికి ఆధార భూతమైన ఆనందం మాత్రమే శాశ్వతంగా నిలిచేది. మనం "శివ" తత్త్వంగా సూచిస్తున్న ఈ మౌలిక పరిమాణాన్ని, దురదృష్టవశాత్తూ, కొద్దిమంది మాత్రమే అనుభూతిచెందగలుగుతున్నారు. ఈ శివతత్త్వమనే ‘వస్త్రం’ మీదనే చరాచరసృష్టి అస్తిత్వమనే ‘చిత్రం’ రంగులతో గీయబడ్డది. ఈ జీవిత కేళి అంతా కూడా దాని పరిమితులు తెలుసుకోగలిగినంతవరకే అందంగా అనిపిస్తుంది. కానీ, మన జీవిత సర్వస్వాన్నీ ఈ నాటకనికే అంకితం చేస్తే, ఏదో ఒకరోజు మనం విచారించవలసి వస్తుంది. కొందరు అదృష్టవంతులకి, వాళ్ల జీవితంపట్ల వాళ్ళకి ఉన్న భ్రమలు చిన్నతనంలోనే పటాపంచలు అవుతాయి. మిగిలినవారికి వాళ్ళ జీవితం వృధాచేసామన్న ఎరుక మృత్యుశయ్య మీద గానీ కలుగదు.

సమయం మించిపోయేలోపునే మీ భ్రమలు తొలగాలని, ఇది మీరు తెలుసుకోవాలని నా ఆకాంక్ష. ఒక్కసారి మీకు జీవింతంలో ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయని ఊహించుకుందాం. మీరు పుట్టినప్పటినుండి ఇప్పటివరకు మీరు సాధించిన దానిలో, విలువైనది, చెప్పుకోదగ్గది ఏదైనా ఉందా? దాన్ని మీరు ఆలోకనం చేసుకోగల తెలివితేటలు మీకిపుడుంటే, మీరు రాబోయే జీవితాన్ని చాలా అందంగా మలుచుకోగలరు. మీకు జీవితంలోని రంగులే కాదు, జీవితానికి ఆధారభూతమైన వస్త్రం ఏదో కూడా అర్థం అవుతుంది. లేకపోతే, 95 శాతం మానవాళికి ఎల్లప్పుడూ ఏవో కొన్ని అనవసరమైన ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. విద్య మీకు పదిమంది ఎదుట ఎలా ప్రవర్తించాలో బోధిస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ మీలో మీరు ఆంతరంగికంగా ఎలా మసలుకోవాలో నేర్పుతుంది. ఇది మీ అంతరంగంలోకి తొంగి చూసుకుని, లోతైన జీవిత మూలాలను తెలుసుకోగలగడం. మీరు మనసుని కావాలన్నప్పుడు వాడుకొని, వద్దన్నప్పుడు పక్కన పెట్ట గలిగినప్పుడే, మీకు మనసువల్ల ప్రయోజనం. అది మీ స్వాధీనంలో లేకుండా ఎప్పుడు చూసినా ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటే, అది కేవలం పిచ్చి అనే అర్ధం. చాలా మంది ఈ స్థితిలోనే ఉంటారు.

విద్య మీకు పదిమంది ఎదుటా ఎలా ప్రవర్తించాలో బోధిస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ మీలో మీరు ఆంతరంగికా ఎలా మసలుకోవాలో నేర్పుతుంది.

మీరు స్త్రీలా, పురుషులా అన్న స్పృహతో సహా, మీరు మీ గురించి ఇంతవరకూ భావిస్తున్న అన్ని ఆలోచనలనూ సమూలంగా చెరిపివేసే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ.  పరిణామక్రమంలో మానవులు అత్యున్నత స్థాయినందుకున్నారు. కానీ వారు తమ జీవితాన్ని ఇంత అస్తవ్యస్తం చేసుకున్నారు. వాళ్ళకి  బ్రహ్మాండమైన మెదడు ఉంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడంలేదు. జరుగుతున్నదేమిటి - వాళ్ళ ఆలోచనలూ ఆవేశాల సమ్మేళనంతో, అంతులేని మానసిక "నాటకం". మీ జీవిత నాణ్యతని నిర్ణయించేది ఏమిటంటే, మీరు మీ అంతరంగంలో ఎంత సౌందర్యవంతంగా ఉన్నారన్నది మాత్రమే. అది ఎవరికీ కనిపించదు; వేరేవారెవ్వరూ గుర్తించవలసిన పనీ లేదు; ఏవ్వరూ దాని మీద శ్రద్ధ పెట్టవలసిన పనీ లేదు. కానీ, మీకు అన్నిటిలోకీ విలువైనది అదే.

ఈ సందర్భంలో అంటే మీ మనస్స మీద నియంత్రణ తెచ్చుకోవడానికి, "శివ శంభో" అని ఉఛ్ఛరించడం అధ్భుతాలు సృష్టిస్తుంది.  శివుడు ప్రత్యక్షమవుతాడని కలలుకనవద్దు.  అతను మీ జీవితంలో ఏ రకంగానూ జోక్యం కలిగించుకోడు. ఇది మతపరమైన ప్రక్రియకాదు.  ఇది మనసులోని కల్మషాన్నంతటినీ శబ్దం అనే సాధనం ద్వారా నిర్మూలించే విధానం. "శివ శంభో" అని మీరు సమర్థవంతంగా ఉఛ్ఛరించగలిగితే, మీకు కొత్త శక్తీ, అంతులేని అనుగ్రహమూ, మేధా సంపత్తీ మీకు అందుబాటులో ఉంటాయి.

 ప్రేమాశిస్సులతో,
సద్గురు

https://soundcloud.com/sadhguru/shiva-shambho-chant-by-sadhguru