చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు/నిర్మాత  శేఖర్ కపూర్, ఆరోగ్యం, దీర్ఘాయుషు గురించి సద్గురుతో ముచ్చటించిన విషయాలను, ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

శేఖర్ కపూర్: ఆరోగ్యం, దీర్ఘాయుర్దాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. కాని వాటి మీద ఉన్న  అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో, నాకు రెండు ప్రశ్నలున్నాయి: 1) ఒక వయస్సు దాటిన తర్వాత జీవించి ఉండడానికి ఉన్న విలువేమిటి? 2) ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత కూడా జీవిస్తూ ఉంటే, మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనలో అంతర్గతంగా ఏమైనా ఉందా లేదా మనకు నిరంతరం వైద్యులు, ఆసుపత్రుల నుండి బయటి సహాయం అవసరమా? ఒకవేళ మనలో అంతర్గతంగా ఏమైనా ఉన్నట్లయితే ప్రకృతికి మనను సజీవంగా ఉంచే ఉద్దేశం ఉందని నేను నమ్మవలసి ఉంటుంది.

సద్గురు : ప్రకృతికి మిమల్ని సజీవంగా ఉంచే ఉద్దేశం లేకపోయినట్లయితే మీరు మరణించి ఉండేవారు. ఇప్పుడు కూడా, మీరు బ్రతికి ఉన్నారంటే దానికి మీరు తీసుకునే మందులు కాని, మీ ఆరోగ్య పరీక్షలు కాని, మీరు చేస్తున్న ఆసుపత్రి సందర్శం కాని కారణం కాదు. ప్రకృతి మీరింకా జీవించి ఉండాలని అనుకోవడమే కారణం. ఇందుకు మీ  జీవన ప్రక్రియే కారణం కానీ మీరు తీసుకునే ఔషధాలు కాదు. వైద్యం కొంత వరకు తోడ్పడగలదంతే. అది జీవితాన్ని సృజించలేదు.

ఇప్పుడు మీరు ధరించిన ఈ శరీరం, అంతర్ముఖం నుండి సృష్టించబడిందే. మీరు బయటి నుండి దీనికి అవసరమైన ముడిసరుకును అందించి ఉండవచ్చు, కాని శరీర సృష్టి మాత్రం లోపలి నుండే జరుగుతుంది. మీ ఆరోగ్య నిర్వహణను మీరు బయటి నుండి చేయాలనుకుంటే, అది చాలా ప్రయత్న పూర్వకమైన ప్రక్రియ అవుతుంది. మీరు కనక మీ అంతరాంతర్గత మూలంతో సంసర్గంలో ఉంటే, మీకు ఆరోగ్యం సహజంగానే లభ్యమవుతుంది. మీరు దాన్ని బయటినుండి నిర్వహించుకోవాలనుకోవడం అంటే మీ అవగాహనలో పొరపాటు ఉందని అర్ధం.

ఈ భూగోళం మీద 70% పైగా రోగాలు దీర్ఘరోగాలు. అంటే అవి మీ సొంత శరీరంలో మీ సొంత వ్యవస్థతో  మీరు సృష్టించుకున్నవే.

శేఖర్ కపూర్: అంటే ఒకరు, వారి  అంతరంగంతో నిరంతర సంసర్గంలో ఉండడమే ఆధ్యాత్మికత, సృష్టి మొత్తంతో మీ సంబంధమే – ఇలా ఉంటే, ఆరోగ్యం గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేకుండా - సహజంగానే అది ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది - అవునా?

సద్గురు: శరీరంలోని ప్రతి జీవకణమూ సహజంగానే ఆరోగ్యం విషయంలో ప్రణాళికీకరింపబడి(ప్రోగ్రాం) ఉంటుందన్నది ఇవ్వాళ అందరికీ తెలిసిన వైద్య పరిజ్ఞానం. అది ఆరోగ్యంకోసం ప్రోగ్రాం చేయబడి ఉన్నది కాబట్టి, అది మీకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? మనం అంటురోగాల్నీ, దీర్ఘరోగాల్నీ వేరుచేసి చూద్దాం. అంటురోగం బయటి జీవుల దాడివల్ల సంక్రమిస్తుంది. అది ఒక యుద్ధం లాంటి పరిస్థితి. వాటిని చంపడానికి మనం  రసాయనిక యుద్ధం చేయాలి. కాని ఈ భూగోళం మీద 70% పైగా రోగాలు దీర్ఘరోగాలు. అంటే అవి మీ సొంత శరీరంలో మీ సొంత వ్యవస్థతో  మీరు సృష్టించుకున్నవే. జీవించాలని, జీవనం కొనసాగించాలని బలమైన కోరిక ఉన్న ఈ వ్యవస్థ ఒక రోగాన్ని ఎందుకు పుట్టిస్తుంది, తనకు వ్యతిరేకంగా తానెందుకు పనిచేస్తుంది? ఎందుకంటే ఎక్కడో ఏవో ప్రాథమిక అంశాలు పట్టాలు తొలిగాయని దీని అర్ధం. మీ అంతరాంతర మూలంతో - మీ శరీర సృజనకు ఆధారమైన దానితో - మీరు సంసర్గంలో ఉంటే ఆరోగ్యం అనేది మీరు చర్చించవలసిన విషయం కాని, తహతహలాడవలసిన విషయం కాని అవ్వదు. ఈ వ్యవస్థను మీరొక నిర్దిష్ట పద్ధతిలో ఉంచితే ఆరోగ్యం స్వాభావికంగానే వ్యక్తమవుతుంది.

శేఖర్ కపూర్: ఈ పద్ధతిని మీరు ధ్యాన మార్గం అంటారా?

సద్గురు: అట్లా అనాలనే అనుకుంటాను, కాని ‘ధ్యానం’ అన్న పదాన్ని నేను ఉపయోగించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఈ పదాన్ని విపరీతంగా దుర్వినియోగం చేశారు. నేను ‘ధ్యానం’ అంటే ప్రతివ్యక్తీ అదంటే తనేమనుకుంటున్నాడో అదే అని అర్థం చేసుకుంటాడు. ధ్యానం అంటే సంపూర్ణంగా నిశ్చలంగా కూర్చోవడమని మీకు తెలిస్తే, అంటే మీ లోపల అంతా - రోజులో కేవలం రెండు నిమిషాల పాటే మీరు - నిశ్చలంగా ఉన్నట్లయితే మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కేవలం రెండు నిమిషాలే. మనిషి అనారోగ్యంగా ఉండడానికి కారణం నిశ్చలంగా ఉండడమెలాగో వారికి తెలియకపోవడమే...!