ఆఫ్రికా ఖండం గురించి సద్గురు తన అభిప్రాయాలను ఇక్కడ పంచుకుంటారు... అక్కడి సారవంతమైన నేల, పచ్చని ప్రకృతీ, జీవంతో తొణికిసలాడే ప్రజలూ మొదలైన విషయాల గురించి. "ఉగాండాలో నా ప్రయాణాలు,  కీన్యా-దక్షిణ ఆఫికాలో నా మజిలీలూ...ఎంతో ప్రేరణత్మకమైనవీ, వాటి విభిన్నతతో ఆహ్లాదం కలిగించాయి," అని అంటున్నారు సద్గురు.  ఐక్యరాజ్యసమితిలో, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడి ఎంతో మంది హాజరైన యోగా సమావేశం గురించీ, ఈ పర్యటనలో చేసిన అనేక మజిలీల గురించి కూడా విశేషాలు తెలియజేస్తున్నారు.

ఆఫ్రికా ఖండపు నేల గురించి ప్రస్తావించాలంటే, ముందుగా అక్కడ నేను గమనించింది ఆ నేలలోని సారం--- ఈ భూమండలంలో మరెక్కడా అలా అనిపించదు. ఆఫ్రికా తన నేలని సారవంతంగా నిలబెట్టుకునేందుకు, అక్కడి పచ్చని ప్రకృతిని పరిరక్షించడానికీ వ్యూహ రచన చేయడం అవసరం.  ఆఫ్రికాలో చాలా భాగం మరుభూమి అయినప్పటికీ, ఎక్కడ అడవులు దట్టంగా ఉన్నాయో, వాటిని నిలబెట్టుకోవాలంటే చాలా జాగరూకతతో నడుచుకోవాలి. గత కొన్ని శతాబ్దాలుగా ఆఫ్రికా ఖండపు ప్రజలు పడరాని కష్టాలు అనుభవించారు. దోపిడీ, పరులకి భూభాగం కోల్పోవడం, ఘోరమైన బానిస వ్యాపారం, నష్టపోయిన సాంస్కృతిక పటుత్వము... వెరసి, వారు మిగితా వారికంటే తక్కువ సమర్థులుగా కనపడేలా చేశాయి. అదృష్టవశాత్తూ, జనాభాలో జీవం తొణికిసలాడే యువజన వర్గాలు తమ వారసత్వానికి గర్వ పడుతూ, భవిష్యత్తు అందుకునేందుకు సచేతనంగా ఉద్యమిస్తున్నాయి. ప్రపంచం ఈ ఉద్యమానికి తోడ్పాటునందించి, అందులో భాగస్వామి కావాలి. మానవజాతి ఆవిర్భావానికి గర్భాశయమైన ఆఫ్రికా ఖండపు ప్రత్యేకతని పరిరక్షించడం చాలా ముఖ్యం.

వాళ్ళ ఆహారం, వస్త్రధారణ, వైఖరులలో వెయ్యేళ్ళ క్రితం మనుషులు ఇలా ఉండేవారన్నట్టు సూచిస్తూ, ఇప్పుడే భూమిని చీల్చుకుని బయటకు నడుచుకువచ్చారా అని అనిపిస్తుంది.

"ఉగాండాలో నా ప్రయాణాలు, కీన్యా-దక్షిణ ఆఫికాలో నా మజిలీలూ...ఎంతో ప్రేరణాత్మకమైనవీ, వాటి విభిన్నతతో  ఆహ్లాదం కలిగించాయి. ఎందుకు ప్రేరణ అన్నానంటే అక్కడ నాకు ఎదురైన నూతన శక్తి కారణంగా. ఆఫ్రికా యువతలో పెల్లుబికే ప్రేరణా శక్తి సులభంగా పోల్చుకోగలిగిందీ; పట్టణాల్లో, నగరాల్లో స్పష్టంగా కనిపించేదీను. 4200 అడుగుల ఎత్తు ఉండే పర్వతాలూ, హరితారణ్యాల మధ్య అగ్నిపర్వతాలవల్ల ఏర్పడ్డ అనేక సరస్సుల మధ్య నున్న Ndali వంటి మారుమూల ప్రాంతాలలో ప్రజలు వాళ్ళ ఆహారం, వస్త్రధారణ, వైఖరులలో వెయ్యేళ్ళ క్రితం మనుషులు ఇలా ఉండేవారన్నట్టు సూచిస్తూ, ఇప్పుడే భూమిని చీల్చుకుని బయటకు నడుచుకు వచ్చారా అని అనిపిస్తుంది. ఇదంతా చూస్తే తప్ప నమ్మశక్యం కాదు. మనకి మరో యుగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మన మెడిటేటర్స్, ఏ విద్యాభ్యాసమూ లేని సద్గురు పేరుమీద "సద్గురు విద్యాలయం" అని ఒక పాఠశాలని ప్రారంభించారు. కొందరు అంకితభావం కలిగిన స్వయంసేవక కార్యకర్తలు (volunteers) దీనిని సాధ్యం చేశారు.

భారతీయ మూలాలుగల వర్గాలు, మనదేశానికి ఆవల ఈ ప్రాంతాలలో వాణిజ్యవ్యాపారాలలో సఫలత సాధించడం ఒక విజయగాథ. తూర్పు ఆఫ్రికాతో మన బంధం కొన్ని శతాబ్దుల ప్రాచినమైనది అయితే, ఉత్తర ఆఫ్రికాతో అనుబంధం కొన్ని వేల సంవత్సరాలనాటిది. ఇన్ని శతాబ్దాలుగా కొన్ని సమాజాలు వాటి విలక్షణతని చెక్కుచెదరకుండా ఎలా నిలబెట్టుకున్నాయో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వారు వాళ్ళ భాషనీ, ఆహారపు అలవాట్లనీ, వస్త్రధారణనీ, అన్నిటికంటే మిన్నగా వాళ్ళ ఆధ్యాత్మికతనీ ఎక్కడో దూరదేశంలో నిలబెట్టుకోగలిగారు. తూర్పు ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థకి వారి తోడ్పాటు గణనీయమైనది.

"ఉప-యోగ" కార్యక్రమానికి 50 మందికి పైగా రాయబారులూ, 135 దేశాల ప్రతినిధులూ హాజరయ్యారు.

20న దుబాయ్ మీదుగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి సరిగ్గా వేళకి అందుకోగలిగాను. "ఉప-యోగ" కార్యక్రమానికి 50 మందికి పైగా రాయబారులూ, 135 దేశాల ప్రతినిధులూ హాజరయ్యారు. హాజరులో అదొక కొత్త ప్రమాణం. తూర్పు కోస్తాలో(East Coast) ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇన్నర్ ఇంజనీరింగ్ రిట్రీట్(Inner Engineering Retreat) చాలా ఆనందాన్నిచ్చింది., షికాగోలో ఒక చిన్న మజిలీ, కార్యక్రమం తర్వాత, 3 రోజులు III (టేన్నేసే ఆశ్రమం) గడపడానికి వచ్చాను. తిరిగి న్యూయార్క్ లో  ఒక రోజు,  బెర్లిన్ లో ఒక రోజు, లండన్ లో కొద్ది రోజులు గడుపుతాను.

గురుపూర్ణిమకి మళ్ళీ ఈశా యోగా సెంటర్ కి రావడానికి కుతూహలంతో ఎదురు చూస్తున్నాను. ఈ సారి ఇది చాలా ప్రత్యేకమైనది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు