బృఘు సంహిత వెనకాల ఉన్న శాస్త్రం గురించి, దీన్ని ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఎలా ఉపయోగిస్తారు అన్న విషయాలని సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: శివుడి మొట్టమొదటి శిష్యులైన సప్త ఋషులలొ బృఘు మహర్షి ఒకరు. వాళ్ళందరికీ ప్రతి రోజూ శివుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం నిత్య ప్రక్రియ. వారి భక్తిని, వినమ్రతను ఆయనకు అర్పించుకునే విధానమిది. బృఘు మహర్షి ఎంతో గాఢమైన భక్తుడు. ఈయనకి శివుడంటే చాలా ఎక్కువ భక్తి. ఒకరోజు ఈయన ఇలా ఆలోచించారు "నేను పార్వతి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాను. నాకు ఆయన భార్యతో ఎం పని? నేను శివుడి చుట్టూ మాత్రమె ప్రదక్షిణం చేస్తాను" . ఆయన పార్వతిని పక్కకి జరగమని చెప్పారు. పార్వతి చాలా కోపంతో అందుకు నిరాకరించింది. బృఘు మహర్షి ఒక చిన్న పక్షిలా మారి, పార్వతిని వదిలేసి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేసారు. శివుడు ఈ వినోదాన్ని చూస్తున్నాడు. ఇలా బృఘు మహర్షి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేయడంతో పార్వతికి కోపం పెరిగిపోతోంది.

బృఘువు ఏం చేస్తాడో చూద్దామని, శివుడు పార్వతిని తన ఎడమ తొడ మీద కుర్చోబెట్టుకున్నారు. అప్పుడు బృఘువు ఒక చిన్న తూనీగలా మారి పార్వతిని వదిలేసి శివుడి తల చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేసాడు. పార్వతి కోపం తారా స్థాయికి చేరుకుంది. "ఇదేం పిచ్చి పని" అనుకుంది. శివుడు మాత్రం ఈ నాటకాన్నంతా ఆస్వాదిస్తూ పార్వతిని ఇంకా దగ్గరగా లాక్కుని తనలో భాగం చేసేసుకున్నాడు. అలా వారిద్దరూ ఒక్కటిగా కూర్చున్నారు. ఆయన తనలోని సగ భాగాన్ని వదిలిపెట్టి ఆవిడని ఆయనలో లయం చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు. తూనీగలా ఉన్న బృఘువు ఒక రంధ్రం చేసి మళ్ళీ శివుడి చుట్టూ మాత్రమె ప్రదక్షిణం చేసాడు. పార్వతికి ఎంత కోపం వచ్చిందంటే, బృఘువుని "నీ శరీరం అంతా క్షీణించి పోవుగాక! శివుడి చుట్టూ ప్రదక్షిణం కాదు కదా, నువ్వు ఇంకొక్క అడుగు కూడా వేయలేనట్టుగా అయిపో" అని శపించింది.

ssh

ఆయన తనలోని సగ భాగాన్ని వదిలిపెట్టి ఆవిడని ఆయనలో లయం చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు

బృఘువు కండరాలు అన్నీ పోయి, కేవలం ఎముకలు, చర్మంగా మారిపోయాడు. ఆయన నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయారు. అప్పుడు శివుడు కల్పించుకుని "నువ్వు బృఘువుకి ఎం చేసావ్? అతను భక్తుడు. భక్తులు పిచ్చివారిలా ఉంటారు, ఇతడు నీ మీద అగౌరవంతో చేయలేదు. నువ్వు అతనికి 'నేను కూడా శివుడిని' అని చెప్పావు అనుకో, అతడు నీ చుట్టూ కూడా తిరిగేవాడు. ఇందంతా చేసుండకపోవలసింది " అని అన్నారు. కాని అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇప్పుడు ఆయన దానిని మార్చలేడు. అందుకని బృఘువు నిలబడటానికి శివుడు మూడో కాలు ఇచ్చాడు. మీరు కొన్ని శివాలయాలలో ఒక మనిషి మూడు కాళ్ళ మీద నిలుచున్న ప్రతిమని చూస్తారు. ఈ మూడో కాలికి నిల్చునే శక్తి మాత్రమె కాక, ఈ ముల్లోకాలను గ్రహించగల శక్తి ఉంది. ఇది మానవ చైతన్యానికి ప్రతీక.

మానవ చైతన్యానికి చిత్రకల్పన

ఈ అవగాహనతో ఈయన బృఘు సంహితని సృష్టించారు. ఇది ఈ సౌరమండలం ముగిసేవరకు మానవులు ఎలా ఉంటారో చెప్పే ఒక మ్యాప్ (map) లాంటిది. ఈయన వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడట్లేదు. ఈయన మానవాళి గురించి, ఇది ఏ విధంగా పరిణామం చెందుతుందో, ఎలాంటి మనుషులు ఇక్కడికి వస్తారో, ఎలాంటి పరిస్థితులు వాళ్ళ పట్ల వస్తాయో, ఇలాంటి విషయాలన్నీ ఎన్నో పరిగణంలోకి తీసుకొని చెప్పారు.

ఇది ఈ సౌరమండలం ముగిసేవరకు మానవులు ఎలా ఉంటారో చెప్పే ఒక మ్యాప్ (map) లాంటిది

ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, గాలి ఎలా వీస్తోందో అని మీరు ఒక పటం తయ్యారుచేయాలనుకోండి, అతి పీడనం, అల్ప పీడన ప్రదేశాలను బట్టి ఇది తయారు చేస్తారు. ఇదే విధంగా బృఘువు కూడా మానవ చైతన్యం యొక్క పటం తయ్యారు చేసారు. ఇందులో ఒక మనిషి ఎలాంటి గర్భంలోకి వెళ్తారు, ఏం జరుగుతుంది, ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఎంతో విస్తారంగా వివరించడమే కాకుండా, వీటిని విశ్లేషించడానికి కొంత మందికి శిక్షణని కూడా ఇచ్చారు.

ఇది చదవడం ఎలా?

ఈ పటాలను (maps) చదవాలంటే ఇటువంటి శిక్షణ అవసరం. మీరు ఇటువంటి వ్యోమయాన పటాలను (Astronautical maps) చూసినట్టయితే మీకు ఇది అర్ధమవుతుంది. ఇందులో భూమి గుండ్రంగా ఉండడం, దాని పరిభ్రమణం, కాల మండలాల మార్పు ఇవన్నీ కూడా ఈ మ్యాప్స్ లో ఉంటాయి. ఇవి చదవడం వచ్చిన వారు, రెండు నిమిషాలు ఇవి చూస్తే వాళ్లకి తెలియాల్సినవన్నీ తెలిసిపోతాయి. అదే గనక మీకు ఇటువంటి శిక్షణ లేకపోతే, మీరు వీటితో రోజులు తరబడి గడిపినా మీకు ఇవేమీ అర్ధంకావు.

ఇదే విధంగా బృఘువు కొంతమందిని ఇటువంటివి చదివేందుకు అవసరమైన శిక్షణనిచ్చాడు. ఇది అస్సలు తార్కికమైనది కాదు, మీరు ఇటువంటివారి ఎదురుగుండా కుర్చున్నారనుకోండి. వారు మీ పుట్టుపూర్వోత్తరాలని గాని, మీ భవిష్యత్తుని కాని చూడటం లేదు. వారు ఇటువంటి మ్యాప్ని చదువుతూ, మీకు పరిస్థితులు ఎలా రాబోతున్నాయో గ్రహించి చెబుతారు. వీరు గ్రహించినది ఎల్లప్పుడూ సరైనదే అవ్వాలని ఏమి లేదు ఎందుకంటే ఇది వ్యక్తిగత సామర్ధ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి వారు ఒకే విధంగా చదవలేరు, కాని ప్రాధమికమైన విషయాలు సరిగ్గానే ఉంటాయి. ఉదాహరణకి, ఒక వాతావరణ శాస్త్రజ్ఞుడు గాలి వత్తిడిని బట్టి, తేమ పదార్ధాన్ని బట్టి, ఇంకా వేరే విషయాల ఆధారంగా ఇవ్వాళ్ళ వాన పడుతుంది అని చెప్పవచ్చు. కాని ఇది నూరు శాతం సరైనది కాదు, కొంచెం తేడా రావచ్చు. ఇక్కడ వాన పడేబదులు అక్కడ పడచ్చు, ప్రకృతి కొద్దిగా మార్పు చెంది ఉండవచ్చు. కాని వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఎక్కడో అక్కడ వాన పడుతుంది, ఇది కూడా అలాంటిదే.

విధి అనేది ఒకరు నిర్ణయించేది కాదు, అది మీ స్వీయ కర్మ

ఈ వ్యక్తులు, ఒక స్థితిలో ఉంటే తప్పితే ఇది చేయలేరు. సాధారణంగా ఇలాంటివి దేవాలయాల చుట్టూరా జరిగేవి, కాని ఆర్ధిక కారణాలవల్ల ఇవి అక్కడి నుండి జరిపివేయబడుతున్నాయి. ఇప్పుడు ఇవి అంత సమర్ధవంతగా ఉండి ఉండకపోవచ్చు, కాని ఇవి ఇంకా సరిగ్గా చేయగలవారు కొంతమంది ఉన్నారు.

అన్నీ ముందే నిర్ణయించబడ్డాయా ?

అంటే విధి ముందే నిర్ణయించబడిందని దీనర్ధమా? విధి అనేది ఒకరు నిర్ణయించేది కాదు, అది మీ స్వీయ కర్మ. మీ సాఫ్ట్ వేర్ ఒక నిర్ణీత విధానంలో ఉంటే, ఇది సహజంగానే అదే విధంగా పని చేస్తుంది. ఉదాహరణకి, ఎవరో మీరు ఇన్ని సంవత్సరాలు జీవిస్తారు అని చెప్పారు అనుకోండి. మీరు ఆ మరుక్షణమే కొండ మీదనుండి దూకేయచ్చు. మీ శారీరక, మానసిక దేహాలు మీరు నిర్మించుకున్నవి. అందువల్ల మీరు ఈ రెండింటిని నాశనం చేయగలరు, కాని జీవితానికి మీరు తాకలేని వేరే అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి ఈ సాఫ్ట్ వేర్ ప్రకారంగానే జరుగుతాయి. ఇటువంటివారు ఈ సాఫ్ట్వేర్ని చదివి చెబుతున్నారు.

"నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను" అని మీరు అంటే, "నాకు ఎటువంటి కర్మ ఉన్నా సరే, నేను వెళ్లదలచుకున్న మార్గంలో నేను వెళ్తున్నాను.

మీ కంప్యూటర్ మీద ఒక రకమైన సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మీరు ఈ కంప్యూటర్ని పగలగోట్టేసినా, మీ హార్డ్ డ్రైవ్ ని కొత్త సిస్టం లో పెడితే, మళ్ళీ ఈ కొత్త కంప్యూటర్లో ఆ పాతదే వస్తుంది. అందుకనే, ఇప్పుడు మీరు కొండ మీద నుండి దూకేసినా సరే, మీకు మరి కొద్ది కాలం తరువాత అదే సాఫ్ట్వేర్తో మరో కొత్త కంప్యూటర్ వస్తుంది. మళ్ళీ అవే జరుగుతాయి, కొత్తగా ఏమి జరగవు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, వారు సరైన వారే అయితే మీ భవిష్యత్తుని చెప్పడానికి నిరాకరిస్తారు. మీరు ఒకసారి "నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను" అని మీరు అంటే, "నాకు ఎటువంటి కర్మ ఉన్నా సరే, నేను వెళ్లదలచుకున్న మార్గంలో నేను వెళ్తున్నాను. నేను ముక్తి వైపుగా వెళ్తున్నాను. ఇతర కారణాలు ఎలా ఉన్నా సరే, సమాజం ఏమంటున్నా సరే, నా జన్యువులు (Genes) ఏమైనా సరే, నా కర్మ ఎలా ఉన్నా సరే, గ్రహాలూ ఏమంటున్నా సరే, నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నానో, అక్కడికే వెళ్తాను." ఆధ్యాత్మికత అంటే ఇది - విధిని మీ చేతుల్లోకి తీసుకోవడం.

ఏదీ ముందరగా నిర్ణయించబడలేదు, చివరికి మరణం కూడా. అన్నీ మీరు సృష్టించుకున్నవే, మీతో సమస్య ఏమిటంటే మీరు చాలా వరకు స్పృహలేకుండా సృష్టించుకున్నారు. ఇది వేరే ఎవరో చేసి మీ మీద పడేస్తున్నారు అనుకుంటున్నారు. మీరు ఏదైతే స్పృహ లేకుండా సృష్టిస్తున్నారో, అది మీరు ఎరుకతో కూడా సృష్టించవచ్చు. ఆధ్యాత్మిక ప్రక్రియలోని శ్రమంతా ఇదే - మీరు ఎరుక లేకుండా అనవసరమైనవి సృష్టించుకునే బదులు, మీరు ఎరుకతో మీ జీవితాన్ని సృష్టించుకోండి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: supernova