సద్గురు మనకు మహాకాళేశ్వరుడి విశిష్టతను ఇంకా శివుడు, లింగాకారం గురించి దానికి సంబంధించి ఇక్కడ వివరిస్తున్నారు.

ఈ దేశంలో వేల కొద్ది శివాలయాలు ఉన్నాయి. అందులో చాలా వరకు ఒక విగ్రహం అంటూ లేదు; సాధారణంగా ఒక సూచికగా ఒక లింగ రూపం ఉండేది. లింగాన్ని చేసే శాస్త్రం అత్యంత ఆధునాతమైనది. లింగాన్ని సరైన పదార్ధంతో తాయారు చేసి, శక్తివంతం చేస్తే అది శాశ్వత శక్తి రూపంగా మారుతుంది. భారతదేశంలో లింగాలను ఎందరో యోగులు, సిద్ధులు వివిధ అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన లక్షణాలతో సృష్టించారు.

లింగాన్ని సృష్టించే శాస్త్రాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఉంది. కానీ గత 800 – 900 సంవత్సరాలుగా భక్తి ఉద్యమం దేశమంతా వ్యాపించిన తరువాత ఈ శాస్త్రము కనుమరుగై పోయింది. రూపం లేని ఆ శూన్యంలో ఆనందాన్నిచ్చే  అనుభవం ఒకటుంది. దాన్ని తెలుసుకోవడానికే గుళ్ళూ, గోపురాలూ స్థాపించబడ్డాయి. మీరు ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయాగపడేవి మీ పంచేంద్రియాలే – అవే  కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కాని శూన్యాన్ని తెలుసుకోవడానికి మీ పంచేంద్రియాలు సరిపోవు.

కాల అంటే సమయం. మీరు ఈ పంచభూతాల మీద ఎంత నియంత్రణ సాధించినప్పటికి మీరు ఈ అనంతమైనదానితో ఒక్కటై పోవాల్సిందే. మీరు లయం అయిపోవాల్సిందే. మీరిక్కడ ఉన్నంతవరకు మీ కాలం సాగిపోతూనే ఉంటుంది.  కాలాన్ని నియంత్రించగలగడం అనేది పూర్తిగా ఒక విభిన్నమైన కోణం. కాలం అంటే కేవలం సమయం కాదు. కాలం అంటే అంధకారం కూడా. ఎందుకు కాలం అంటే అంధకారం..? కాలం వెలుగు అవ్వలేదు. ఎందుకంటే వెలుగు కాలంలో ప్రయాణం చేస్తుంది. వెలుగు కాలానికి దాస్యం చేస్తుంది. మనం వెలుతురు అని దేనినైతే అంటామో దానికి ఒక మొదలు, ఒక అంతం ఉన్నాయి. కానీ కాలం అలాంటిది కాదు.

ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో అటువంటివారికి ‘మహాకాళ’ తత్త్వం అత్యంత ప్రాముఖ్యమైనది.

ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో అటువంటివారికి ‘మహాకాళ’ తత్త్వం అత్యంత ప్రాముఖ్యమైనది. ఉజ్జయినీ లోని మహాకాళేశ్వరాలయంలో ఉన్న లింగం అత్యద్భుతమైనది .అది మిమ్మల్ని మీ మూలాలనుండి కుదిపేస్తుంది. మహాకాళేశ్వర లింగం అత్యంత శక్తిమంతమైనది.

శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు. మానవాళి వెలుగును ఎంతో గొప్పగా ప్రశంసించడానికి కారణం, వారు చూడటానికి  ఉపయోగించే కళ్ళ నైజం అలా ఉంది కాబట్టి. కానీ, నిరంతరం ఉండేది చీకటి మాత్రమే. ఈ చీకటి ఓ పదార్ధం కాదు , వస్తువు అంతకంటే కాదు . వెలుగు లేకపోవడమే చీకటి. అవగాహనా రాహిత్యమే  చీకటి . జ్ఞాన రాహిత్యమే చీకటి . ఇదే సర్వోత్తమమైనది. మీకు తెలియనిది ఎంతో ఉంది , అందుకే మీకది అంధకారంలా గోచరిస్తుంది . అయితే ఇదేదో వస్తువు కాదు , మీ అవగాహనకి మించినది కాబట్టి , ఇదో అంధకారంలా అనిపిస్తుంది .

“శివ” అని సూచించబడుతున్న అనంతమైన ఈ శూన్యం పరిమితిలేని నిరాకార స్వరూపం… దానికి మొదలూ చివరా లేవు, అది శాశ్వతమైనది. అయితే మనిషి అవగాహన, రూపానికి పరిమితమైపోయింది కాబట్టి, మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో  ఈ “శివ”త్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం.

తీర్థయాత్ర ఒక జైత్రయాత్ర కాదు. అదొక సమర్పణ. మీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న మిమ్మల్ని మీరే తొలగించుకునే మార్గమది.

ఈ మహాకాళేశ్వర లింగానికి నిత్యం స్మశాన వాటిక నుండి వచ్చే భస్మం తోనే అభిషేకం చేయడం అవసరం.ఈ మహాకాళేశ్వర సన్నిధి ఎంత మహిమాన్వేతమైనదంటే, దీని పరిధిలోకి వచ్చినదేదైనా లయమైపోవలసిందే! సమస్తం బూదిడై పోవలసిందే! భౌతిక బంధాల నుండి విముక్తులౌతారు

అసలు ఈ తీర్థయాత్ర ఎందుకు చేయాలి?

మనకంటే ఉన్నతమైన దాన్ని అనుభూతి చెంది, మన ఇంద్రియాలకు అందని ప్రమాణాలను చేరుకోవాలంటే, మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘నేను’ అనే భావన తగ్గిపోవాలి. తీర్థయాత్ర ఒక జైత్రయాత్ర కాదు. అదొక సమర్పణ. మీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న మిమ్మల్ని మీరే తొలగించుకునే మార్గమది. మీకై మీరు పక్కకు తొలగలేకపోతే, మిమ్మల్ని మీరు కరిగించుకునే మార్గమది. అన్ని పరిమితులనూ, నిర్భంధతలనూ తొలిగించేసి, హద్దులు లేని చేతనా స్థితికి చేర్చగలిగే ప్రక్రియ అది.‘నేను’ అనే భావనని తగ్గించడమే తీర్థయాత్ర యొక్క మౌలిక ఉద్దేశ్యం. నడుస్తూ, అధిరోహిస్తూ, ప్రకృతి యొక్క కఠినమైన ప్రక్రియలకు మిమ్మల్ని మీరు గురిచేసుకుంటూ శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర.

ప్రేమాశీస్సులతో,
సద్గురు