మనం పాటించగలిగే రాముని లోకోత్తర గుణం!

srirama

మనుషులతో  చాలా దగ్గరగా కొంతకాలం మీరు కలసి జీవించినప్పుడు వారి గురుంచి చిన్నగా అన్నివిషయాలూ మీకు తెలుస్తాయి. కొన్నిసార్లు మీరు వారిని చాలా బాగున్నట్లు చూస్తారు, కొన్ని సార్లు కోపంగా ఉన్నట్లు,  ఉదారంగా ఉన్నట్లు లేదా సంకుచితంగా ఉన్నట్లు – ఇలా ప్రతివారి నాటకం మన ముందు బయట పడుతుంది. దాని మూలంగా వారు ఎలా ఆలోచిస్తారు, ఎలా అనుభూతి చెందుతారు అనేది మీకు తెలుస్తుంది. దీని ఫలితంగా, మీరు ప్రతి మనిషి  గురుంచీ, ఎన్నో ఎక్కువ నిర్ణయాలకు వచ్చేస్తారు.

మీకు మీ మీదా, ఇతరుల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ధారణలు విడిచిపెట్టడానికి ఇదే సరైన సమయం.

మీకు మీ మీద, ఇతరుల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ధారణలను విడిచిపెట్టేందుకు ఇదే సరైన సమయం. ప్రతి ఒక్కరికీ ఒక అందమైన జీవిగా మారే అవకాశం ఉంది. మీవద్ద ఎన్ని ఎక్కువ అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ధారణలు, పక్షపాతాలూ ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి ఇది ఒక సదవకాశం. మీకు, ఇతరులకు కూడా ఒక కొత్త ప్రారంభానికి అవకాశం ఇవ్వండి.

రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే, రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారి పోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది, ఇంకా  చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది. అతని భార్యను రావణాసురడు అపహరించాడు. ఆమె మీద తనకు ఉన్న ప్రేమ, అనురాగాల వల్ల దక్షిణ భారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని, సముద్రం దాటి, లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.

రావణాసురడికి పది తలలు ఉండేవని మీకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపటానికి వాట్టినన్నింటినీ నరకవలసిందే. యుద్ధం గెలిచిన తరువాత రాముడు “నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది, ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను. నేను ఒక పరమ శివ భక్తుడిని, ఒక అసాధారణమైన పండితుని, ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను’’ అన్నాడు. మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు “మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు” అన్నాడు. అప్పుడు రాముడు “అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది. దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను” అన్నాడు.

 ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు. 

అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒక రోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది. మరొక రోజు అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో లేదా వికారంగా ఉంటుంది. లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా, అనేక సమయాలలో, అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి. ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో  లేదా కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.

రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురడు ఎంత ఘోరమైన పనులు చేసినా, అతని యందు  బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది . ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి – మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మీరు అనవసరమైనటువంటి  వాటినుంచి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.

“ప్రేమ అనేది ఒకరంటే ఒకరికి తెలియని స్త్రీ, పురుషుల మధ్య జరుగుతుంది” అని ఎవరో అన్నారు. అది కేవలం అల్పమైన, ప్రతి క్షణం నిర్దారణలు చేసే, జ్ఞానం లేని వారి జీవితంలోనే యదార్ధం. లేకపోతే మీకు ఎవరి గురుంచి ఎంత ఎక్కువగా తెలిస్తే మీకు వారి పట్ల, అంత ఎక్కువు ప్రేమ, కరుణ కలుగుతాయి. మీకు వారి కష్టనష్టాలు అన్నీ తెలిసినట్లయితే, వారూ మీలాంటి మానవత్వం ఉన్న మనిషే అని తెలుసుకుంటారు.

రాముడు తన భార్యను అపహరించి, ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా, రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను  ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్నిమార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.

దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి.  భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.

మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక.  మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించ గలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి. ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి, అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తుంచాం కాబట్టి.

ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంది . మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి. మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా, మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే, మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ ఆ మామిడి పళ్ళను, గులాబి పూలను గుర్తిస్తారు. మీరు చేయవలసినది అంతే. పదండి, ఈ  ఆశయాన్ని సాధిద్దాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *