మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటాము, కాని మన  బాధకు కారణం బయటి పరిస్థుతులే అనుకుంటాము. బాధ ఇంకా ఆనందం మనలోనే ఉన్నాయని, ఆనందాన్ని ఎలా సృష్టించాలో అనే దాని గురించి  సద్గురు ఏమంటున్నారో  వ్యాసంలో తెలుసుకుందాం.


చాలా మంది అసలు ఆనందం అనేది ఒకటి ఉందన్న విషయాన్నే మర్చిపోయారు. వారు ఆనందం ఒక భ్రమ అనుకుంటున్నారు. వారు జీవితంలో ఆనందం వాస్తవం కాదని, బాధే వాస్తవమని అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు.

మీ మనసులో జరిగే మార్పులలో(మీ చిత్తవృత్తులలో), మీరు చిక్కుకుపోయి ఉండకపోతే, ఆనందంగా ఉండటమనేది సహజం. మీరు మీ మనసు మీద నియంత్రణను కోల్పోవడం వలన మీకు బాధ కలుగుతోంది. ఒక సంక్లిష్ట పరికరం అయిన మీ మనసుని మీరు నియంత్రించడం ప్రారంభించారు. కానీ కొంత సమయం తరువాత అది ఎక్కడికి వెళుతోందో మీకు అర్ధమవ్వటం లేదు. అదే మీ బాధకు కారణం.

బాధ మీ మీద వర్షించట్లేదు, అలాగే ఆనందం కూడా మీ మీద వర్షించట్లేదు. రెండూ కూడా మీలోనే సంభవిస్తున్నాయి. మీరు బాధని సృష్టించకపోతే, ఆనందం మీలోని ఒక సహజ స్ధితి అవుతుంది. దయచేసి మీరు ఇది తెలుసుకోండి. మీరు ఆనందాన్ని సృష్టించవలిసిన అవసరం లేదు. మీకు బాధని ఎలా సృష్టించకూడదో తెలిస్తే చాలు, అప్పుడు మీలో సహజంగా కలిగేది ఆనందం మాత్రమే. అంటే, ఆనందం చాలా ప్రాధమిక, సహజ స్ధితి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు