పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో రెండవ సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


సూత్రం - 2 : మీ పిల్లల అవసరాలను తెలుసుకోండి

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని అత్యంత  శక్తిమంతులుగా తయారు చేయాలనే అభిమతం, ఆకాంక్షలతో పిల్లల్ని అనవసరంగా అనేక కష్టాలకు గురిచేస్తుంటారు. వారు, తాము జీవితంలో ఏమి సాధించాలనుకొని సాధించలేకపొయరో, అది తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అత్యంత కఠినంగా  కూడా ప్రవర్తిస్తారు. మరికొందరు తల్లిదండ్రులు తమ అతి గారాబంతో, చాలా  ప్రేమ కురిపిస్తున్నామన్న భ్రమతో, అన్నీ తామై పెంచి, తమ పిల్లల్ని ఈ లోకంలో అప్రయోజకులుగానూ, శక్తి హీనులుగాను మిగుల్చుతారు.

parenting2 ఒకప్పుడు కాశ్మీరీ శైవం అనే పద్ధతికి చెందిన యోగి ఒకరుండేవారు. యోగాకి చెందిన ఏడు పద్దతులలో ఇది ఒకటి. ఇది చాలా శక్తివంతమైనది.  ఈ పద్ధతి కాశ్మీరులోనే  ఎక్కువగా వ్యాపించటంతో, ఆ పేరుతోనే ప్రసిద్దికెక్కింది. ఒకరోజు ఆ యోగి కొంచం పగిలిన పట్టుకాయ నుండి బయటపడటానికి అవస్థపడుతున్న సీతాకోక చిలుకను చూసాడు. పట్టుకాయ దృఢంగా ఉంది. సాధారణంగా దాని నుంచి బయటపడటానికి 48 గంటలు నిర్విరామ పయత్నం పడుతుంది. ఒకవేళ అది బయటకి రాలేకపోతే మరణించడం తధ్యం. యోగి ఇదంతా చూసి జాలితో తన గోటితో గూడును బలవంతంగా చీల్చి, సీతాకోక చిలుక బయటకు వచ్చే పరిస్థితిని కల్పించాడు. కాని జరిగిందేంటంటే సీతాకోక చిలుక బయటకి వచ్చినా ఎగరలేక పోయింది.

 సీతాకోకచిలుక బయటకి రావడానికై చేసే ప్రయత్నమే దానికి తన రెక్కలను ఉపయోగించి ఎగరడానికి కావలసిన సామర్ధ్యాన్ని కల్పిస్తుంది.

కారణం- సీతాకోక చిలుక బయటకి రావడానికై చేసే  ప్రయత్నమే  దానికి తన రెక్కలను ఉపయోగించి ఎగరడానికి కావలసిన సామర్ధ్యాన్ని కల్పిస్తుంది. సీతాకోక చిలుక ఎగుర లేకపోతే ఇంకేం ప్రయోజనముంటుంది? అలా చాలమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అత్యంత ప్రేమను చూపిస్తున్నామనుకుంటూ, పిల్లల్ని పైన పేర్కొన్న సీతాకోక చిలుకలా తయారు చేస్తారు. ఆ పిల్లలు ఇక తమ జీవితంలో ఎదుగనే ఎదగలేరు.

ప్రతి  పిల్లవాడికి ఒక్కో స్థాయిలో శ్రద్ధ ,ప్రేమ, క్రమశిక్షణ అవసరం అవుతాయి

పిల్లల పెంపకంలో ఒకే ప్రామాణికమైన సిద్దాంతం ఉండదు. ఇది ఒక విధమైన విచక్షణతో కూడుకున్న అంశం.  ప్రతి పిల్లవాడు విలక్షణమైన వాడే. ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరికి  ఎంత వరకు చేయవచ్చు ? ఏమి చెయ్యకూడదు? అనే అంశాలలో ప్రమాణాలేవి ఉండవు. ప్రతి పిల్లవాడికి ఒక్కో స్థాయిలో శ్రద్ధ, ప్రేమ, క్రమశిక్షణ అవసరమవుతాయి. నేను కొబ్బరితోటలో ఉన్నపుడు మీరెవరైనా వచ్చి ' చెట్టుకి ఎంత నీరు పొయ్యాలి ? '  అని అడిగితే  నేను కనీసం ' 50 లీటర్ల నీరు అవసరం ' అని చెప్తాను. కాని మీరింటికి వెళ్లి అక్కడ గులాబీ మొక్కకి అంతే నీరు పోస్తే , అది నీరెక్కువై చచ్చూరుకుంటుంది. మీ ఇంటిలోని మొక్క ఎటువంటిదో, ఎంత  నీరు అవసరమో మీరే గ్రహించ గలగాలి .

ప్రేమాశీస్సులతో,
సద్గురు


పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మొదటి సూత్రం ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు - 1/5 - అనుకూల వాతావరణాన్ని కల్పించండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మూడవ సూత్రం ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 3/5 - మీ పిల్లల నుండి మీరు నేర్చుకోండి!

పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన నాల్గవ సూత్రం ఇక్కడ చదవండి!

పిల్లల పెంపకంలో మెళకువలు – 4/5 - పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెరగనివ్వండి!

Photograph courtesy of National Geographic Television