ఒక రోజు కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేస్తున్న శంకరం పిళ్ళై తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అది విని  నివ్వెర పోయి, 'ఎవర్ని పెళ్లి చేసుకుంటావు?' అని అడిగింది శంకరం తల్లి కోపంగా. 'మన పక్కింటి అమ్మాయి లూసిని' అని అన్నాడు శంకరం పిళ్ళై. వెంటనే తండ్రి, 'ఏమిటీ? ఏ సాంప్రదాయంలేని ఆ లూసిని పెళ్లి చేసుకుంటావా?' అని అరిచాడు. 'అసలా అమ్మాయి జుట్టు చూసావా? ఉడతలు పీకిన తాటి టెంకలా ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు?' అని అన్నాడు మామ. ఆముదం తాగిన ముఖంతో అత్త 'అసలా అమ్మాయికి మేకప్ చేసుకోవడమే తెలియదు' అంది. సరే నేనేమి తీసిపోను అంటూ భూమికి జానెడైనా లేని  మేనల్లుడు 'లూసిని చేసుకోవద్దు మామా, ఆమెకి ఫుట్ బాల్  గురించి ఏమి తెలియదు'  అన్నాడు. అందరి ప్రశ్నలకీ, ఉచిత సలహాలకీ బదులుగా శంకరం పిళ్ళై 'లూసీకి ఉన్న ఒక సుగుణం ఆమెకు కుటుంబం లేకపోవడమే. అందుకే నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను' అన్నాడు తాపీగా.

మానవ శరీరంతో శిశువు ఈ భూమ్మీదకి వచ్చినప్పుడు మిగతా ప్రాణుల్లాగా కొద్ది రోజుల్లోనే తన కాళ్ళపై తాను నిలబడి, స్వతంత్రంగా బ్రతకలేదు. ఈ శిశువుకి కావలిసినవి మంచి పోషణ, శిక్షణ. ఈ రెండిటితోనే క్రొత్త జీవితం  రూపుదిద్దుకుంటుంది. ఇది కుటుంబ వాతావరణంలోనే సాధ్యమౌతుంది.  అందుకే కుటుంబం యొక్కఅవసరం వచ్చింది. మనిషి ఎదుగుదలకి కుటుంబం యొక్క ఊతం ఉండి తీరాలి. దురదృష్ట్టవశాత్తూ చాలామందికి 'కుటుంబం' ఊతంగా కన్నా అడ్డంకిగా అవుతోంది. ఎదుగుదలకి సహాయపడటం పోయి ఒక చిక్కువలయంలా తయారవుతుంది. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తరచు ఇటువంటి ఇబ్బంది కరమైన పరిస్థితులలో ఇరుక్కుంటారు. దీనికి కారణం కుటుంబం కాదు, కుటుంబతో మీరు ఉంటున్న విధానం.

ఎంతోమంది  శ్రీమంతుల విషయంలో వారి సంపదే వారి పాలిట శాపమయింది. విద్య కూడా అంతే. 

మన శ్రేయస్సుకోసం ఏర్పరుచుకున్నదే మనకి ప్రతికూలంగా మారడానికి ఒక ఉదాహరణ కుటుంబం. ఒక్క కుటుంబం విషయంలోనే కాదు, వేరే విషయాలలో కూడా ఇలా జరగడం మామూలైపోయింది. ఉదాహరణకి సిరి సంపదలు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. కాని, ఎంతోమంది  శ్రీమంతుల విషయంలో వారి సంపదే వారి పాలిట శాపమయింది. విద్య కూడా అంతే. ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని దోచుకుంటున్నది ఈ విద్యావంతులే కదా? మానవాళిపై కురిసిని ఈ వరాలన్నిటినీ కూడా ఏకంగా మన ఉనికికే ఎసరు పెట్టే శాపాలుగా మార్చుకున్నాం.

నిజానికి కుటుంబం మనకు అన్నివిధాలా ఒక పట్టు కొమ్మగా ఉండాలి. అంతే కానీ ఒక అడ్డుగోడలా మారకూడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా ఇలా జీవితంలో చిక్కుకు పోవడమనేది మీ  చుట్టూ ఉన్నవారి వల్ల జరగటం లేదు. మీ అంతరంగం గురించి మీరేమీ చేయకపోవటం వల్లే అలా జరుగుతుంది. మీ అంతరంగం కొంత పరిపక్వత, పూర్ణత చెంది, మీరు ఒక పరిపూర్ణ జీవిగా భాసిల్లితే, మీకు స్వతహాగానే మరొకర్ని పట్టుకుని వేళ్ళాడే అవసరం తగ్గుతుంది.

అసంపూర్ణ వ్యక్తిత్వం మూలంగానే ఇలా  ఆధారపడవలసిన అవసరం వచ్చింది. మనశ్రేయస్సుకై రూపొందించిన వాటిని కూడా మనకు హాని చేసేలా మార్చుకొవడం అనేది అసంపూర్ణ వ్యక్తిత్వం అనే ఈ నిర్బంధం మూలంగానే జరుగుతుంది. మీరు రెండు మొక్కల్ని మట్టిలో పక్కపక్కనే నాటారనుకోండి. రెండూ విడి విడిగా, రెంటికీ కావలసినంత సూర్యరశ్మి వచ్చేలా పెరగాలన్న ఇంగితం వాటికి ఉన్నట్లు మీరు గమనిస్తారు.  రెండూ అదే భూమిలో వేళ్ళూనుతాయి, వాటికి అక్కడనుంచి వెళ్ళిపోయే స్వేచ్ఛ కూడా లేదు, అయినా రెండూ రెండు పూర్తి ప్రాణులలాగా బ్రతుకుతాయి. దేనికి అదే ఒక పరిపూర్ణ ప్రాణిగా బ్రతుకుతుంది. మీరు కూడా అలాగే ఒక పరిపూర్ణ జీవరాశిలా ఇక్కడ కూర్చుంటే, ఆ పరిపూర్ణతను అనుభవిస్తారు. అలా కాకుండా ఒక వ్యక్తిత్వంతో మీరు ఇక్కడ కూర్చుంటే, తీవ్రమైన అసంపూర్ణత మిమ్మల్ని పీడిస్తుంది. ఫలితంగా ఎవరో ఒకర్ని పట్టుకుని వేళాడాలని  అనిపిస్తుంది

నిజానికి మీమటుకు మీరు సంపూర్ణ జీవులు. మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకునే అవసరం అసలు లేనేలేదు. కాకపోతే మీరు ఒక వ్యక్తిగా గాక, కేవలం జీవిగా ఉండగలిగితేనే ఇది సాధ్యమౌతుంది. 

అయితే సంపూర్ణ వ్యక్తిత్వమంటూ ఏదైనా ఉందా? లేదు, అటువంటిదేదీ లేదు. ఒక జీవి సంపూర్ణంగా ఉండగలడు కానీ అతని వ్యక్తిత్వం ఎప్పుడూ పరిపూర్ణత చవి చూడలేదు. వ్యక్తిత్వం ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటుంది. అది దాని  సహజ గుణం. అందుకే మీరు వ్యక్తిత్వంపై ఎంత పెట్టుబడి పెట్టినా దండగే. పైపెచ్చు మీలో అసంపూర్తి, అభద్రతా భావాలు పెరిగి, పీడిస్తాయి.

మన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం గాఢమయ్యేకొద్దీ విడిపోతామన్న భయం కూడా పెరిగిపోతుంది. జీవితంలో ఒకరినుంచి విడిపోవలసి వచ్చినప్పుడు మీ శరీరంలో ఒక భాగాన్ని ఎవరో నరికేస్తున్నంత బాధ కలుగుతుంది. మిమ్మల్ని రెండుగా విడగొట్టినట్లు బాధపడతారు. నిజానికి మీమటుకు మీరు సంపూర్ణ జీవులు. మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకునే అవసరం అసలు లేనేలేదు. కాకపోతే మీరు ఒక వ్యక్తిగా గాక, కేవలం జీవిగా ఉండగలిగితేనే ఇది సాధ్యమౌతుంది.

అసలు ధ్యానం అంటే అదే. మీరు ఒక 'వ్యక్తి ' లా కాకుండా కేవలం ఒక జీవిలా ఉండటం. నిజానికి మీరు ఒక జీవే, ఒక వ్యక్తి కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: commons.wikimedia.org