ప్రశ్న: సద్గురూ, కొన్నేళ్ళ కిందట నా పరిస్థితులేమీ బాగుండేవి కావు. అప్పట్లో ఎవరో నా మీద చేతబడి చేశారన్నారు. అసలు అలాంటివి జరక్కుండా చూసుకోడమెలా?

సద్గురు: అసలు అన్నిటికన్నా హీనమైన చేతబడి మీ మనసులో జరిగేదే. దాంతో పోలిస్తే ఎదుటివాళ్ళు చెయ్యగలిగేది చాలా అత్యల్పం. ఏ రకంగా చూసినా కూడా మీకు మీరు చేసుకోగలిగే అన్యాయమే చాలా ఎక్కువ. మీ మనసుని మీరు పరిశుభ్రపరుచుకోగలిగితే, వేరేవాళ్ళు చెయ్యగలిగే చేతబడిని మీరు పట్టించుకోనవసరం లేదు. కాని మీ మనసే చేతబడికి నిలయంగా మారిపోతే మటుకు, ఎదుటివాళ్ళు దాన్ని కొద్దిగా రగిలించినా అది మిమ్మల్ని ధ్వంసం చేసెయ్యగలుగుతుంది. మన చుట్టూ ఉండేవాళ్ళ ఉద్దేశ్యాల్ని మనం అదుపుచెయ్యలేం గానీ, మన లోపల జరిగేదాన్ని మాత్రం మనం అదుపుచేసుకోగలం. దాన్ని నూటికి నూరు శాతం మనం కోరుకునేవిధంగా మార్చుకోగలం. బయట మనుషుల సంకల్పాలేమిటో మనకి తెలియదు. వాళ్ళొచ్చి మీతో పాటు ఒక సత్సంగంలో కూర్చోవచ్చు, కానీ తమ అంతరంగంలో మిమ్మల్ని చంపాలని ఆలోచిస్తూండవచ్చు. ఇది సాధ్యమే.

మన చుట్టూ ఉండేవాళ్ళ ఉద్దేశ్యాల్ని మనం అదుపుచెయ్యలేం గానీ, మన లోపల జరిగేదాన్ని మాత్రం మనం అదుపుచేసుకోగలం. దాన్ని నూటికి నూరు శాతం మనం కోరుకునేవిధంగా మార్చుకోగలం

తక్కినవాళ్ళు మీ గురించి పెట్టుకునే ఉద్దేశ్యాల్ని మీరు పూర్తిగా అదుపుచెయ్యలేక పోయినా, వాటినేదో ఒక మేరకు తీర్చిదిద్దుకోవచ్చు. లక్షలాది మంది మిమ్మల్ని ప్రేమించే విధంగా మీరు పరిస్థితిని తీర్చిదిద్దుకోవచ్చు. ఆ విధంగా చూస్తే, మీరు వాళ్ళ సంకల్పాల్ని నియంత్రిస్తున్నట్టే. కాని ఎప్పటికీ నూటికి నూరు శాతం మాత్రం కాదు. ఒక్కొక్కప్పుడు మొత్తం మీ కుటుంబమే మీకు ఎదురు తిరగవచ్చు. మనచుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లో ఇది రోజూ జరుగుతూ ఉన్నదే. కాబట్టి మీ చుట్టూ ఉన్న మనుషులు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారన్నదాన్ని పట్టించుకోవడం వదిలిపెట్టి, ముందు మీ మనసే మీమీద ఎటువంటి దారుణ కృత్యాలు తలపెట్టగలిగే శక్తిని కలిగివుందో తెలుసుకోవడం మంచిది. దాన్ని మీరు సరిచేసుకోగలిగితే, ఇక వేరేవాళ్ళు చేసే మాయ, చెడుదైనా, మంచిదైనా, మీ మీద అంతగా పని చేయదు. ఒకవేళ అది మీ మీద ప్రభావం చూపించినా, అది చాలా బలహీనంగా ఉంటుందే తప్ప మీ జీవిత దిశానిర్దేశాన్ని మార్చలేదు.

చేతబడి శాస్త్రం నేటి ప్రపంచంలో దాదాపుగా అంతరించిపోయింది. ఇది నిజానికి మంచి విషయం కాదు. ఆ శాస్త్రాన్ని మనం మంచి ఉద్దేశ్యాల కోసం వాడుకోగలిగి ఉండేవాళ్ళం. చేతబడి అనేది కొన్ని ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి మనిషి తన ఆంతరంగిక శక్తుల్నో లేదా బాహ్యశక్తుల్నో ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం. కాని దురదృష్టవశాత్తూ మనుషులు దాన్ని దుర్వినియోగపరిచారు. అందులోనూ మంచిపనులకు వాడుకునే చేతబడికన్నా చెడ్డపనులకు వాడుకునే చేతబడే వ్యాపారపరంగా మనగలుగుతుంది. కనుక ప్రజాదరణ ఆధారంగా ఎక్కువ మంది చేతబడిని సన్మార్గంలో కంటే దుర్మార్గంలోనే వాడటం మొదలుపెట్టారు. ఏ సామర్థ్యమైనా దానికదే చెడ్డది కాదు. దాన్ని వాడే చేతుల వల్లనే దాని మంచీ, చెడూ నిర్ణయమవుతాయి. ప్రతి సామర్థ్యాన్నీ మనం మనుషుల శ్రేయస్సుకి గానీ లేదా నాశనానికి గానీ వాడవచ్చు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ, సాంకేతికపరిజ్జానాలే ఇందుకు చక్కట నిరూపణ. కొన్నిసార్లు పనులు దురుద్దేశ్యాలతో చెయ్యబడుతాయి. కొన్ని సార్లు అత్యంత చెడ్డపనులు కూడా చాలామంచి ఉద్దేశ్యాలతో చేయబడుతాయి. ఈ రోజు మనం ప్రపంచంలో చూస్తున్నదిదే. మానవాళి పొందగలిగిన అత్యంత మహనీయ వరాల్లో ఆధునిక సాంకేతిక విజ్ఞానశాస్త్రం ఒకటి. కాని దురదృష్టవశాత్తూ దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టి నూరేళ్ళు తిరక్కుండానే మనం దాన్ని మనకు ఎంత వ్యతిరేకంగా మలచుకున్నామంటే, అది ప్రస్తుతం కేవలం మనిషి మనుగడనే కాదు, ఈ భూగోళం మనుగడనే ప్రశ్నిస్తోంది.

చేతబడి అనేది కొన్ని ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి మనిషి తన ఆంతరంగిక శక్తుల్నో లేదా బాహ్యశక్తుల్నో ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం

సాంకేతిక పరిజ్ఞానం సాధించిన అద్భుతాల్ని మీరు మహిమ అంటారా లేక చేతబడి అంటారా? మీకెలా అనిపిస్తే అలా అనుకోవచ్చు. బహుశా విజ్ఞానశాస్త్రం మొదలైనప్పుడు మంచి ఉద్దేశ్యాలతోటే మొదలై ఉండవచ్చు. అలాగే మీరు చేతబడి అని పిలిచేది కూడా మొదట్లో మంచి ఉద్దేశ్యాలతోటే మొదలయ్యింది, కాని మనుషులు దాన్ని రకరకాలుగా వాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దాన్ని నిజంగా ప్రయోగించగలిగే మనుషులు దాదాపుగా మృగ్యమైపోయారు, కాబట్టి మీరా విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయినా వాళ్ళు తమ శక్తినీ, సమయాన్నీ వృథా చేసుకోవడానికి, ఇంతకీ మీరెవరని? మీరు ఒక రాజో, చక్రవర్తో అయ్యుంటే, ఎవరైనా హాని తలపెట్టలనుకుంటారని మీరు ఆందోళన చెందవచ్చు. లేదా మీరేదైనా బంగారు గని మీద కూర్చొనివుంటే, మీరు ఇలాంటి విషయాల గురించి ఆందోళన చెందాల్సిరావచ్చు. ఎందుకంటే ఎవరైనా మీ బంగారుగనిని చేజిక్కుంచుకోవాలని కోరుకుంటుండవచ్చు. ఐనా మీరు దేని మీద కూర్చున్నారు? ఏమీ లేదు . కాబట్టి నిశ్చింతగా ఉండండి. మీ మీద అద్భుతాలు చెయ్యడానికో, లేదా చేతబడి చెయ్యడానికో తమ కాలాన్నీ, శక్తినీ, సొమ్మునీ ఎవరూ వృథాచేసుకోరు. కనుక, వీటన్నిటి గురించి ఆలోచించడం కంటే, మీరు మీలోనే నిక్షిప్తమై ఉన్న మీ సొంత మహిమను వెలికి తీయడం మంచిది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు