Sadhguruరుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు. అవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతం లోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన ప్రకంపన ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే ప్రకంపన అంత బాగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ చాల రుద్రాక్ష చెట్లు భారతీయ రైల్వే వారు రైలుమార్గం వేసేటప్పుడు పట్టాల క్రింద స్లీపర్లుగా వాడారు, అందుకే భారతదేశంలో ఈ చెట్లు కొన్నే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయిలాండు, ఇండోనేషియాల నుంచి వస్తున్నాయి.

మాలలు (లేక) దండలు

సహజంగా ఈ విత్తనాలు అన్ని కూర్చి ఒక దండలాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి లేని పక్షంలో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీనివలన సున్నితమైన మనుషులకి మానసిక స్థిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా, ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటే చాలా మంచిది. మీరు వేడి నీటితో స్నానం చేస్తూ మరియు రసాయనాల సబ్బు వాడితే కొన్ని రోజుల తరువాత ఆ మాల పెళుసుగా మారి పగులుతుంది, అటువంటి సమయాల్లో మాలను ధరించకుండా ఉంటే  మంచిది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారంతో చేస్తే మంచిది. మీరు ఈ మాలను దారంతో ధరిస్తే ప్రతి 6 నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది. లేదంటే ఏదో ఒక రోజు ఆ మాల ఆకస్మికంగా తెగిపోయి 108 పూసలు చిందరవందర అవుతాయి. మీరు రాగి, వెండి మరియు బంగారం ఉపయోగించిన మంచిదే కాని, ఎక్కువ సందర్భాలలో మీరు ఆ మాలను తయారికి స్వర్ణ కారుడి దగ్గరికి తీసుకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ స్వర్ణకారుడు బంగారపు దారం తో గట్టిగా ముడి వేస్తె ఆ రుద్రాక్ష యొక్క లోపలి భాగం పగులుతుంది.

వ్యక్తులని స్వర్ణకారులకి చెప్పమని నేను చెబుతున్నప్పటికీ, అది పూర్తి అయ్యినా దగ్గరికి తీసుకువచ్చినప్పుడు 30 - 40 శాతం సమయాల్లో అవి పగిలే ఉండటం నేను చూస్తున్నాను. వదులుగా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం. ఎక్కువ బిగుతుగా ఉండకూడదు, ఒత్తిడి వల్ల లోపల పగుళ్ళు ఏర్పడితే అస్సలు మంచిది కాదు. రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకోకూడదు, అది సరయినది కాకపోతే జీవితాన్ని అస్తవ్యస్తం చేయవచ్చు.

ఉపయోగాలు

రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి మీ శక్తినే ఒక కవచంలాగా తయారుచేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి. అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ ఒకే చోట కాకుండా తిరుగుతూ, వేరు వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు ఇది గమనించే ఉంటారు; మీరు క్రొత్త చోటకు వెళ్ళినప్పుడు, ఒకోచోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు, ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్రరాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైనది కాక పోవడం వల్ల, అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులూ, సన్యాసుల నియమాలలో ఒకేచోట రెండవ సారి పండుకోకూడదు అన్నది ఒకటి కాబట్టి; వారు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిస్థితులూ, పరిసరాలూ వారికి బాధకలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు. ఈ రోజుల్లో మళ్ళీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటున్నారు, పడుకుంటున్నారు. మనిషి ఒకే చోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది, కాని ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినేవారికీ, నిద్రించే వారికీ; రుద్రాక్ష మీ శక్తితోనే గూటిని ఏర్పరస్తుంది అందువల్ల, అది చాలా ఉపయోగకరం.

రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్య దశలో తిరుగుతుంది.  

రుద్రాక్షలవల్ల మరో ఉపయోగం: అరణ్యాల్లో నివసించే సాధువులూ, సన్యాసులూ ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశమున్నది కాబట్టి అన్ని చోట్లనుంచి త్రాగలేరు, అలా త్రాగితే ఆ నీరు వారిని దుర్బలం చేయవచ్చు, చంపివేయవచ్చు కూడా. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు త్రాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్యదిశలో తిరుగుతుంది, ఆ నీరు త్రాగటానికి హానికరము అని తెలుస్తుంది. అంతే కాక చారిత్రకంగా ఒక కాలంలో, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో, ఒక మూర్ఖపు పోటీ ఏర్పడింది. వేద కాలంలో ఒకే దేవుడు శివుడు లేక రుద్రుడు ఉండేవాడు, కాలం గడచిన కొద్దీ వైష్ణవులు వచ్చారు. ఆ కాలం పరిస్థితులలో వైష్ణవులు శైవులను, ముఖ్యంగా సన్యాసులను, తమ ఇంటికి ఆహ్వానించి వారికి విషాహారాన్ని వడ్డించేవారు. అందుకే శైవులు తమను రక్షించుకునేందుకు ఒక చిన్న ఉపాయం కనుగొన్నారు. ఇప్పటికి కూడా శైవులలో అనేక తెగల వారు దీని ఆచరిస్తారు. మీరు వారికి ఆహారం పెడితే, వాళ్ళు మీ ఇంట్లో తినరు. ఆహారం బయటకు తీసుకు వెళ్ళి రుద్రాక్షమాలను ఆహారం మీద పట్టుకుంటారు. అది సవ్య దిశలో తిరిగితే గ్రహిస్తారు, అపసవ్య దిశలో తిరిగితే గ్రహించరు. ఇప్పటికీ కొందరు దీన్ని ఆచరిస్తారు. మీరు రుద్రాక్ష ధరిస్తే అది మీ సౌరభాన్ని నిర్మల పరుస్తుంది. సౌరభం అంటే మీ చుట్టూ ఉండే శక్తి పరమైన కాంతి, అది తెల్లని తెలుపు నుంచి పూర్తి నలుపు దాకా మధ్యలో లక్షల వర్ణాలతో ఉండవచ్చు. రుద్రాక్ష ఈ సౌరభాన్ని నిర్మలం చేస్తుంది. మీరు ఈ రోజు రుద్రాక్ష వేసుకుంటే రేపు మీ సౌరభం శ్వేతమౌతుందని కాదు.

మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుద్రాక్ష మంచి ఉపకరణము, ఉపయోగకరరం. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంటే, తనను మెరగు పరచుకోవడానికి దొరికిన అన్ని అవకాశాలనూ ఉపయోగించు కోవాలనుకుంటాడు, ఆ విధంగా రుద్రాక్ష ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగకారి.

ప్రతికూల శక్తులపై కవచం

ఒక గురువు అనేకమందికి అనేకరకాలుగా రుద్రాక్షను శక్తివంతం చేస్తారు. రుద్రాక్ష దుష్ట శక్తులనుంచి రక్షణగా ఉంటుంది. కొందరు ఇతరులకు హాని కలిగించటానికి కొన్ని దుష్ట శక్తులను ప్రయోగించవచ్చు, ఆ రకంగా ఒక పెద్ద శాస్త్రం కూడా ఉన్నది. అధర్వణవేదం అంతా శక్తులను మీకు సానుకూలంగా, ఇతరులకు ప్రతికూలంగా ఉపయోగించటం గురించే. ఈ ప్రక్రియలో నిష్ణాతులైన వారు ఆ విధంగా ఉపయోగించ దలచుకుంటే; ఇతరులకు ఎంతో బాధ కలిగించవచ్చు, ఇంకా కావాలనుకుంటే చంపనూ వచ్చు. రుద్రాక్ష ఇటువంటి వాటినుంచి కవచంగా పనిచేస్తుంది. మీరు ’నాకెవరు హాని కలిగిస్తారు?’ అని అనుకోవచ్చు. అది మీమీదే ప్రయోగించనక్కరలేదు; మీ ప్రక్కన వారి మీద ప్రయోగించినా, అతను దానిని గ్రహించకపోతే, మీరు అతనితో ఉన్నారు కాబట్టి అది మీమీదకు రావచ్చు, అది సాధ్యమే. ఉదాహరణకు, వీధిలో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటుంటే, వారు మీపై గురి పెట్టక పోయినా మీకే హాని కలగవచ్చు. అలాగే ఇదికూడా. అది మీమీద ప్రయోగింపక పోయినా మీరు అనుకోని పరిస్థితులలో అనుకోని చోట ఉంటే మీకే హాని జరగవచ్చు. వాటి గురించి అనవసరంగా భయపడనవసరం లేదు కాని, రుద్రాక్ష అటువంటి పరిస్థితులనుంచి ఒకరకమైన రక్షణ. ఒక గురువు అనేకమందికి అనేకరకాలుగా రుద్రాక్షను శక్తి వంతం చేస్తారు. గృహస్థులకు రుద్రాక్ష ఒక రకంగా శక్తివంతం చేస్తారు, ఒకరకంగా మీరు దానిని ఒక చిన్న ప్రతిష్ట అనవచ్చు. బ్రహ్మచారులకూ, సన్యాసులకూ రుద్రాక్ష మరో విధంగా శక్తివంతం చేయబడుతుంది, ఈ విధంగా శక్తివంత చేయబడిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకోకూడదు.

మీకై మీకే చాలా ముఖాలు,అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నటే. 

ఏకముఖి రుద్రాక్ష

చాలా మంది ఏకముఖిని ధరించాలని అనుకుంటారు, ఒకే ముఖం ఎందుకంటే అది చాలా శక్తివంతం. మీకై మీకే చాలా ముఖాలు,అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నటే. జనం అంటూ ఉంటారు మీరు ఏకముఖిని ధరిస్తే 12 రోజుల్లో మీరు మీ కుటుంబాన్ని వదిలిపెడతారు అని. మీరు మీ కుటుంబాన్ని వదిలేస్తారా లేదా అన్నది సమస్య కాదు. అవి కేవలం మీ శక్తులు మీరు ఏకాంతం కోరుకునేటట్టు చేస్తాయి ఇది ఇతరలుతో అనుకూలంగా ఉండనివ్వదు.

పంచముఖి

పంచముఖి సురక్షితం మరియు అందరికి మంచిది -పురుషులు, స్త్రీలు ,పిల్లలు అందరికి.ఇది మీ సాధారణ శ్రేయస్సుకి ఆరోగ్యానికి మరియు మీ స్వేచ్చకి ఎంతో మంచిది. ఇది మీ రక్తపోటును తగ్గిస్తుంది. మీ నరాలకు స్వాంతను చేకుర్చి ఒక రకమైన ప్రశాoతతను చురుకుదన్నాని మీ నాడి వ్యవస్తకు కలిగిస్తాయి. మీరు వేరే రకాల రుద్రాక్షలను ధరించాలి అనుకుంటే, ఊరికే కొనుక్కొని మీ వ్యవస్థ పై పెట్టుకోకుండా వాటి గురించి బాగా తెలిసిన వారి నుండి స్వీకరించటం మంచిది.

6 ముఖాల రుద్రాక్ష:

12 వయస్సు లోపు పిల్లలు 6 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. అది వారి ప్రశాంతతకు శ్రద్ధ కు ఉపయోగకారిగా ఉంటుంది. వీటన్నిటికి మించి వారు పెద్దల నుండి సరిఅయిన శ్రద్ధను స్వీకరిస్తారు.

గౌరిశంకర్ మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి. 

గౌరీశంకర్ రుద్రాక్ష

గౌరీశంకర్ అనేది మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసే రకం. సహజంగా ఇది సౌభగ్యాన్ని కలిగిస్తుంది అని ప్రజలు నమ్ముతారు. సౌభగ్యాo అంటే కేవలం డబ్బే కానవసరం లేదు అది ఎన్నో రకాలుగా రావొచ్చు. మీకు ఏది స్వంతం కానప్పటికీ మీ జీవితం లో సౌభాగ్యాన్ని పొందవచ్చు. మీరు సమతుల్యం లేక స్తిమితం గా ఉండే వ్యక్తి అయి ఉండి ,మీ జీవితం లో సున్నితంగా పని చేస్తూ ఉంటె మీకు సౌభాగ్యం రావొచ్చు. మీ శక్తులు బాగా పని చేస్తుంటే అది జరుగుతుంది. గౌరిశంకర్ మీఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి.

బద్రాక్ష ఒక విషపు విత్తనం:

ఇపుడు భారత దేశంలో బద్రాక్ష అనే విషపు విత్తనం ఒకట ఉన్నది. అవి బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో బాగా పెరుగుతాయి. చూట్టానికి అవి అచ్చం రుద్రాక్షల లాగానే ఉంటాయి, మీరు తేడా గుర్తించ లేరు. తమ జీవితంలో అది ఒక పవిత్ర కార్యంగా భావించేవారే రుద్రాక్షలతో వ్యవహరిస్తారు. పారంపర్యంగా, తరతరాలుగా వారు రుద్రాక్షతోనే తమ జీవనాన్ని కూడా గడుపుకుంటారు; అది ఒక పవిత్ర కార్యంగా ప్రజలకు నివేదిస్తారు. కాని గిరాకీ పెరిగినకొద్దీ, వ్యాపారం బయట పడుతోంది. ఇపుడు భారత దేశంలో బద్రాక్ష అనే విషపు విత్తనం ఒకట ఉన్నది. అవి బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో బాగా పెరుగుతాయి. చూట్టానికి అవి అచ్చం రుద్రాక్షల లాగానే ఉంటాయి, మీరు తేడా గుర్తించ లేరు. మీరు చేతిలోకి తీసుకుంటే, మీరు సున్నితంగా గ్రహించగలిగిన వారైతేనే (నాణ్యత తెలిస్తేనే) మీకు తేడా తెలుస్తుంది. అది విషతుల్యమైన విత్తనము, దానిని వంటి మీద ధరించరాదు, కాని అది రుద్రాక్షగా అనేక చోట్ల అమ్మబడుతోంది. అందుకే రుద్రాక్ష నమ్మకమైన వారినుంచే గ్రహించాలి.

ప్రశ్న-జవాబు

ప్రశ్న:సద్గురు, రుద్రాక్షల గురించిన విశేషాలు మాకు తెలియజెప్తారా? ఇతర బీజాలకూ, రుద్రాక్షలకూ ఉన్న తేడా ఏమిటి ?

సద్గురు:ఈ బ్రహ్మాండంలో ప్రతి పదార్థానికీ కొన్ని విశిష్టమైన ప్రకంపనలు (reverberations) ఉంటాయి. ఒక దిశలో ప్రయాణానికి అవి మనకు ఏ విధంగా ఉపకరిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క రుద్రాక్షలే కాదు. అనేక రకాల మొక్కలూ, పుష్పాలూ, జంతువులూ అన్నింటిలో మనల్ని ఆధ్యాత్మికత దిశగా తీసుకు వెళ్లగలిగినవి ఏవీ, తీసుకు వెళ్లలేనివేవీ అని గుర్తించటం జరిగింది. ఉదాహరణకు ఒక గొర్రె ఉన్నదనుకోండి. అది ఆధ్యాత్మిక సాధనలో పనికి వచ్చేది కాదు. ఆంబోతు గానీ, పాముగానీ, నెమలి గానీ ఆ దిశలో పనికి వస్తాయి. కారణం ఈ ప్రాణులలో ఒక విధమైన సూక్ష్మ గ్రాహ్యత (sensitivity) ఉండటమే.

నాకు పది, పదకొండు సంవత్సరాల వయస్సప్పుడు, నేను చాముండీ కొండల మీదా, ఇతర అడవులలోనూ చాలా సమయం గడిపే వాడిని. నేను ఊరికే ఒకే చోట కూర్చొని, ఒక్క మధ్యాహ్నానికల్లా 5-10 నాగుపాములను పట్టగలిగే వాడిని. దీనికి ఒక కారణం ఆ విషయంలో నేను కాస్త నైపుణ్యం సంపాదించుకొని ఉండటం. నాగుపాములు తిరిగే చోట అవి పెద్దగా వాటి జాడలేవీ వదిలి వెళ్ళవు. ఒక రకమైన వాసనా, పాము కదలికలకు సంబంధించిన కొద్దిపాటి ఛాయలూ మాత్రమే ఉంటాయి. నాగుపాము కొద్ది సమయం కిందే ఒక చోటినుంచి, మరొక చోటికి కదిలి వెళ్లింది అని గ్రహించేందుకు మీకు మంచి పరిశీలన శక్తి ఉండాలి.

ఆ రోజుల్లో నాకు నా నైపుణ్యం గురించి చాలా గర్వంగా ఉండేది. చాలా కాలం తరవాత- నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరవాత- నాకు అసలు విషయం తెలిసి వచ్చింది. నిజానికి జరుగుతూ వస్తున్నది, నేను వాటిని పట్టుకోవటం కాదు, అవి వాటంతటవే నా వైపుగా పాకి వస్తున్నాయని. చాలా సందర్భాలలో మధ్యాహ్నం వేళలో , దాదాపు మూడు- అయిదు గంటల మధ్య, నేను అడవికి వెళ్ళి అలా ఊరికే కదలకుండా కూర్చొనే వాడిని. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ ఏడెనిమిది నాగుపాములుండేవి. మీరు కాస్త ధ్యానపరులు అయితే, వెంటనే అవి మీ దగ్గరకు ఆకర్షితమౌతాయి. ఏ ప్రాణులయినా సరే, అలాంటి ఆధ్యాత్మిక ప్రకంపనల వైపు ఆకర్షితమవుతున్నాయంటే, వాటిలో ఆధ్యాత్మికత ఉన్నట్టే.

పూలలో కూడా అంతే. ప్రత్యేకమైన పవిత్రతగల పూలు అనేక రకాలు ఉన్నాయి. ఫలానా ఈ పుష్పం అంటే శివుడికి చాలా ప్రీతి అనీ, ఆ పుష్పం విష్ణువుకు ప్రియమయిందనీ జనం చెప్పుకోవటం మీరు వింటుంటారు. అంటే, మనం శివుడిగానో, విష్ణువు గానో, మరో పేరు తోనో ప్రస్తావించుకొనే తత్త్వాలకు అత్యంత సన్నిహితమైన ప్రకంపనలు గల పుష్పాలను వాళ్ళు గుర్తించారన్న మాట. వాటిని ముట్టుకొన్నా, చేతిలోకి తీసుకొన్నా, అవి ఒక విధమైన ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే దేవాలయాలలో కొన్ని రకాల పుష్పాలను మాత్రమే దేవుడికి సమర్పిస్తారు. దీన్ని రక రకాల పుష్పాలు తీసుకొచ్చి, మనమే నిరూపించచ్చు. మనం రుద్రాక్షలను పుష్పాల మీద ఉంచినపుడు, రుద్రాక్షలు సవ్యదిశలో తిరిగితే, ఆ పుష్పాలు శివుడికి సమర్పించటానికి యోగ్యమైనవని అర్థం. మీరు ఈ ప్రయోగాన్ని కేతకీ పుష్పం (మొగలి పూవు) తో చేసి చూడండి. రుద్రాక్షలకు ఆ పూలు నచ్చవు ! మొగలిపూవును గురించిన కథ ఉన్నదని మీకు తెలుసు గదా, అది శివుని ముందు తప్పుడు సాక్ష్యం చెప్పటం వల్ల , దాన్ని శివుడికి సమర్పించటం మీద నిషేధం వచ్చిందని? ఇలాంటివన్నీ కథల రూపంగా చెప్పేది, ఇవి భక్తుల మనసులో, మెదడులో గట్టిగా హత్తుకుపోవాలని. కానీ అసలు విషయం ఏమిటంటే, పదార్థాల ప్రకంపనలు పరస్పరానుకూలంగా ఉండాలి, అప్పుడే సంబంధం అనేది ఏర్పడుతుంది.

మొగలి పూవు కథలో లాగే, అన్ని పదార్థాలలోనూ, ఈ ప్రకంపనల సారూప్యతను గుర్తించే వాళ్ళు. రుద్రాక్ష అతి విశిష్టమైన, ప్రత్యేకమైన ప్రకంపనలు గల పదార్థాలలో ఒకటి. రుద్రాక్షను కేవలం చేతులో ఉంచుకొని చూసినా ఈ ప్రత్యేకతను గమనించవచ్చు. ఇంకా, మీరు రుద్రాక్షను 3-6 నెలలపాటు ధరించి ఉంటే, దానికి ఇప్పటికే మీ శరీరంతో ఒక రకమైన సంబంధం ఏర్పడి ఉంటుంది. అందుచేత, ఒక్కొక్క మనిషి ధరించే రుద్రాక్షలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందుకే మీరు మీ రుద్రాక్షను ఎప్పుడూ మరొకరికి ఇవ్వకూడదు. మరొకరి రుద్రాక్షను మీరు తీసుకోనూ కూడదు.

ఎందుకంటే, మీ రుద్రాక్షలో మీకే అనువైన, అనుకూలమైన కొన్ని ప్రకంపనలు ఏర్పడిపోయి ఉంటాయి. మీలో కొంత అంశ వాటిలో ఇమిడిపోయి ఉంటుంది. అలాగే మన ప్రాంతాల్లో, ఉప్పూ, నువ్వులూ, నూనె మరొకరి చేతి నుంచి ఎవ్వరూ తీసుకోరు. అలాగే నిమ్మకాయ కూడా. ఎవరి దగ్గరనుంచి నిమ్మకాయ కూడా తీసుకోరు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని పదార్థాలు స్పర్శ మాత్రం చేత ఇతర పదార్థాల ప్రకంపనలను అతి త్వరగా రాబట్ట గలవు. ముఖ్యంగా చిన్న చిన్న నిమ్మకాయలలో ఈ గుణం కనిపిస్తుంది. అవి అన్ని ప్రకంపనలనూ – మంచీ చెడూ రెంటినీ- ‘స్పాంజ్’ లాగా త్వరగా లాగివేయ గలవు. అందుకే నిమ్మకాయలను అటు దేవాలయాలలోనూ, ఇటు క్షుద్ర పూజల ప్రక్రియల లోనూ వాడతారు. రుద్రాక్షకు కూడా ఈ గుణం ఉంది. ఓ రకంగా, రుద్రాక్ష మీ శరీరంలో భాగమే అయిపోతుంది. దీన్ని మీరు ఒకటి రెండు సంవత్సరాలపాటు, ఇరవయి నాలుగు గంటలూ విడవకుండా ధరించారనుకోండి, ఆ తరవాత ఎప్పుడైనా ఒక రోజు దాన్ని తీసేసి నిద్రపోవటానికి ప్రయత్నించారంటే, మీకు నిద్ర పట్టదు. మీ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయిన భావం కలుగుతుంది. కారణం, రుద్రాక్ష మీ శరీరంలో నిజంగానే ఒక భాగమై పోయి ఉంటుంది. అది పని చేయటం కూడా, మీ శరీరంలో ఒక అదనపు అవయవం లాగానే పని చేస్తుంది. ఈ అదనపు అవయవం వల్ల ముఖ్య ప్రయోజనం, మిమ్మల్ని దివ్యానుగ్రహ ప్రాప్తి (‘Grace’)కి సన్నద్ధం చేయటం.

మీరు ఎలాంటి యోగసాధనలు చేసినా, మరొక సాధన చేసినా, చివరికి మీరు సాధించ గోరేదీ, సాధించగలిగిందీ, దివ్యానుగ్రహ ప్రాప్తి ద్వారానే లభిస్తుంది. అందుకే భక్తుల లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అర్పణ బుద్ధితో ఉంటారు గనక. ఆ రకమైన అర్పణ భావం లేకపోతే, యోగ సాధనలు వట్టి సర్కసు విన్యాసాలు గానే ఉండి పోతాయి. రుద్రాక్ష వలన మరో ప్రయోజనం కూడా ఉంది. అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గాడిదలా కలకాలం జీవించాలని ఆశ పడే వారందరికీ, ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రయోజనం ! ఎలా జీవిస్తున్నామన్న విషయంపై వాళ్ళకు ధ్యాస లేదు. మరిన్ని సంవత్సరాలు బతకగలిగితే చాలు అనుకొంటారు. బతకటం దేని కోసం ? ఉదయం నుంచి, సాయంత్రం దాకా వాళ్ళ ‘ఆనంద స్థాయి మాపకం’ (‘Happiness Meter’) పరీక్షిస్తే, అది , వాళ్ళు గొప్ప ఆనంద శిఖరాలు అందుకొన్న దాఖలాలేమీ చూపదు. అసలు వాళ్ళు దీర్ఘాయువుతో, బహుకాలం బతకాలనుకోవటానికి కారణం, వాళ్ళకు మరణమంటే ఉండే అమితమైన భయం మాత్రమే. ఎలాగైనా సరే ప్రాణాలు నిలుపుకొని ఇలాంటి గొప్ప ఆనందాలు అనుభవించాలి అనిపించేలా, చెప్పుకోదగ్గ గొప్ప అనుభవాలేవీ వాళ్ళ జీవితంలో కలిగాయని కాదు.

అలాంటివేమీ లేవు. ఈ జీవితం ముగిస్తే తరవాత ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు గనక, వాళ్ళు దీన్నే పట్టుకు వేళ్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే! జీవితంలో ఏవిషయంలో నైనా- ఆధ్యాత్మిక ప్రక్రియ కానివ్వండి, ఆరోగ్యం, ఆస్తి పాస్తుల లాంటి మరే విషయంలోనైనా కానివ్వండి- విజయం సాధించాలంటే, మీరు దివ్యానుగ్రహానికి సన్నద్ధులుగా (available to Grace) లేకపోతే, అది సాధ్యం కాదు. ఆ స్థితిని మీరు ప్రయత్నపూర్వకంగా నైనా పొందచ్చు. లేక అప్రయత్నంగా మరే ఇతర పద్ధతిద్వారా చేరుకొన్నాచేరచ్చు. ఎంతో కొంత దివ్యానుగ్రహం (Grace) లేకుండా, ఏ మనిషికైనా, ఏ ప్రాణికయినా అసలు జీవంతో ఉండటమే అసాధ్యం. అయితే, ప్రయత్నపూర్వకంగా ముందు ఈ దివ్యానుగ్రహాన్ని మీ జీవితంలో భాగంగా మీరు చేసుకోగలిగితే మిగిలినదంతా సులభంగా, సవ్యంగా జరిగిపోతుంది. కందెన నూనె వేసి రాపిడులూ రణగొణలూ తొలగించిన యంత్రంలాగా, జీవితం సుగమంగా సాగుతుంది. రుద్రాక్ష అలా జరిగేందుకు దోహదం చేస్తుంది. మనకు లభ్యమయ్యే ఆలంబనలనూ, ఆధారాలనూ అన్నింటినీ మనం వినియోగించుకోవాలి మరి!

ఈశా షాప్ ద్వారా కూడా మీరు ఖచ్చితమైన రుద్రాక్షలను కొనుగోలుచేసుకోవచ్చు : Isha Shoppe