ఆనందాన్ని మనం బయట నుండి పొందగలమా? ఇతరుల నిస్సహాయతతో మన ఆనందం ముడిపడి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.

మీరు ఆనందాన్ని బయట నుండి ఎక్కడి నుండో పొందలేరు. మీకై మీరు ఆనందంగా ఉంటారు లేదా ఉండరు, అంతే. మీలో ఆనందాన్ని ప్రేరేపిస్తాయని మీరు నమ్మే చర్యలకు మిమ్మల్ని మీరు బానిసగా చేసుకున్నారు, అంతే. మీరు ఇప్పుడు ఆనందంగా ఉండాలంటే, ప్రపంచంలో చాలా మందికి, వారికి అవసరమైనవి ఉండకూడదు, అవునా, కాదా? అందుకనే మనం మన దేశాన్ని ఇలా ఉంచుకున్నాం. ఎందుకంటే మనం అందరికీ సహాయపడాలని నమ్ముతాం.మీరు అందరికీ సహాయం చేయాలనుకుంటే, అవసరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాలి, అవునా, కాదా?

ఒక వేళ అందరూ బాగానే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరికి సాయం చేస్తారు, మీరు ఎలా సంతోషంగా ఉంటారు? అందుకనే బాగా ఉన్న సమాజాలు బాధగా ఉంటున్నాయేమో. ఎందుకంటే అందరూ బాగానే ఉండటం వల్ల వారు ఎవరికీ సాయం చేయలేకపోతున్నారు. కనుక, గొప్ప విలువలు పేరిట, ప్రేమ పేరిట, మంచితనం పేరిట, మీరు మీ జీవితంలో ఎలాంటి ఆత్మహాని కలిగించే చర్యలనుఎంచుకుంటున్నారో చూడండి.

ఉదాహరణకి, మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి అనుకోండి . అంటే ప్రపంచంలో ఆకలిగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉండాలి. ఒక వేళ రేపు అందరూ బాగా భోజనం చేయగల పరిస్థితి వస్తే, మీరు ఇక ఆనందంగా ఉండరు. అంటే, మీరు మీకు తెలియకుండానే, ఎక్కువ మందికి సరిగ్గా తిండి దొరకని పరిస్ధితి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది జరుగుతోంది.

మనుషులు ఇది తెలిసే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రహం మీద ఉంటున్న 6 లేదా 7 బిలియన్ ప్రజలు తినగల దానికన్నా చాలా ఎక్కువ ఆహారం ఉంది. ఇప్పుడు ఇంచుమించు 18 నుండి 20 బిలియన్ ప్రజలని పోషించగల ఆహారం ఈ గ్రహం మీద ఉంది, అయినా 50% మందికి తినడానికి సరైన తిండి లేదు.

వారు ఎందుకు సరిగ్గా తినలేకపోతున్నారంటే ఆహరం ఉన్న వాళ్ళు ఆ ఆహారాన్ని దాచుకుంటున్నారు. వారు ఇక ఏ మాత్రం తినలేరు, అయినా వాళ్ళు ఆ ఆహారాన్ని దాచుకుంటున్నారు. వాళ్ళు ఇతరులని తిననివ్వరు, కానీ ఎప్పుడో ఒకసారి దానం చేయాలనుకుంటారు. ఎప్పుడో ఒకసారి దానధర్మాలు చేసి స్వర్గానికి టికెట్ లేదా వారి మనసు ఏ చెత్తని కోరుకుంటే, ఆ చెత్తని కొనుక్కోవాలనుకుంటారు.

మనుషులే ఇతర మనుషులను సరిగ్గా జీవించకుండా ఉండేటట్లు చూస్తున్నారు. ఎందుకంటే వారికి వక్రమైన, క్రూరమైన ఆలోచనలు ఉన్నాయి. మీ ఆనందం ఇతరుల నిస్సహాయతతో ఎందుకు ముడి పడి ఉండాలి? ఎవరైనా నిస్సహాయంగా ఉంటేనే, వారికి సహాయం అవసరం, అవునా, కాదా? అంటే, అందరూ హాయిగా ఉంటే, మీరు ఆనందంగా ఉండలేరని అర్ధమా? ప్రస్తుతం మీలో మీరు కల్పించుకుంటున్న స్ధితి అదే.

మీరు ఒక బాధాకరమైన ప్రపంచాన్ని చూస్తే, అది అక్కడ ఉండే మనుషుల మనసు యొక్క స్వభావమని మీరు అర్ధం చేసుకోండి. మీరు ఆనందకరమైన ప్రపంచాన్ని చూస్తే, అది అక్కడ ఉండే మనుషుల మనసు యొక్క స్వభావమని అర్ధం చేసుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ మనసు యొక్క  వ్యక్తీకరణ మాత్రమే.

అందుకే మీరిది తెలుసుకోండి - మీరు ఆనందాన్ని బయట నుండి ఎక్కడి నుండో పొందలేరు. మీకై మీరు ఆనందంగా ఉంటారు లేదా ఉండరు, అంతే!

 ప్రేమాశీస్సులతో,

సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు