“యోగా” అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి త్రిప్పడం అని అర్ధం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు త్రిప్పటం లేక తల్లక్రిందులుగా నుంచోవటం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు 'యోగా' అంటే 'ఐక్యం' అని అర్థం . మీరు అన్నిటితో ఐక్యం అయితే, అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు?

ఈ రోజు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అని, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అని చెప్తుంది. ప్రపంచ మతాలు కూడా 'దేవుడు అంతటా ఉన్నాడు' అని చెప్తున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్త పరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు, ఒక ఆస్తికుడు దాన్ని నమ్ముతాడు, కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు – అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు.

ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠ యోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది – కేవలం భౌతిక అంశానికి మాత్రమే పాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే, 'టెన్నిస్ ఆడండి లేదా నడవండి' అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు, దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలా మంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు, కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినై మూర్ఖంగా చేస్తే, దాని వల్ల మీకు హాని కలుగుతుంది.

హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అధ్బుతమైన ప్రక్రియ అవుతుంది. హఠ యోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగై పోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చెలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి.

సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే హఠ యోగా టీచర్లను తయారుచేయటం కోసం 'ఈశా హఠ యోగా స్కూల్‌' వారు 21 వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 08300097444కి కాల్ చేయండి, లేదా info@ishahathayoga.com కి ఈమెయిల్ చేయండి.