మనకు ఉన్న బాహ్య పరిస్థితులు 100% మనకు అనుకూలంగ ఉండాలని మనమనుకుంటాము. అవి అలా జరగడంలేదని మనం బాధ పడుతూ ఉంటాము. మీరు కోరుకునే విధంగా కనీసం మీరైనా ఉండాలి కాదా? మరి అలా ఉండడం ఎలా  సాధ్యమో సద్గురు మాటల్లో  తెలుసుకోండి


మీలో జరిగే ప్రతిదీ బయటదాని ప్రతిబింబమే. ఉదాహరణకి, హోలీ నాడు అందరూ సంతోషంగా ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుంటూ ఉంటారు. కానీ అదే సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు, వారు మీ మీద రంగు జల్లితే, మీరు చాలా బాధపడుతారు. అంటే మీ ఆనందానికి జరిగే దానితో సంబంధం లేదు, జరిగిన దానిని మీలో మీరు ఎలా అర్థం చేసుకుంటారన్న దాని మీదే అది ఆధారపడుతుంది.

మీరు ఆనందం కోసం బయటవాటి మీద ఆధారపడితే, బయటి విషయాలు మీరు అనుకున్నట్లుగా 100% ఎప్పటికీ జరగవని, కేవలం కొంత వరకే మీరు అనుకున్నట్లుగా జరుగుతాయని మీరు అర్ధం చేసుకోవాలి.

ఆదర్శవంతమైన పరిస్ధితుల గురించి ఆలోచించే ఆదర్శవాద మూర్ఖులు బాహ్య వాస్తవాలని అంగీకరించరు, అదీ వారి సమస్య. ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మీరు కావాలనుకునే విధంగా ఉండరు – మీ భర్త, మీ భార్య , మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, స్నేహితులు, ఎవరూ కూడా అలా ఉండరని మీరు తెలుసుకోవాలి. చివరికి మీ కుక్క కూడా మీరు కావాలనుకునే విధంగా ఉండదు. అది కూడా మీకు నచ్చనిదేదో చేస్తుంది. వాస్తవం ఇలా ఉన్నప్పుడు, కనీసం ఈ ఒక్క వ్యక్తైనా, అంటే మీరైనా, మీరు కోరుకునే విధంగా ఉండాలి, అవునా, కాదా?

 

కనీసం ఈ ఒక్క వ్యక్తైనా, అంటే మీరైనా, మీరు కోరుకునే విధంగా ఉండాలి, అవునా, కాదా?

మీరు కోరుకున్న విధంగా మీరు ఉండగలిగితే, మీరు సహజంగా దేనిని ఎంచుకుంటారు, ఆనందమా, బాధా? ఆనందం మీ సహజ ఎంపిక అవుతుంది, అవునా, కాదా? మీకు ఆ విషయం గురించి ఏ భోధనా అవసరం లేదు; మీకు ఆ విషయంలో ఎవరి సలహా అవసరం లేదు. ఈ ఎంపిక చేసుకోవటానికి మీకు ఏ పురాణాల సహాయం అవసరం లేదు.

మీ సహజ ఎంపిక ఆనందమే అవుతుంది. ఎందుకంటే ఆనందం మీ సహజ స్వభావం, అదేదో మీరు కోరుకోవలసినది కాదు. అదేదో మీరు వెతకవలసినది కాదు, అదేదో మీరు సాధించవలసినది కాదు. మీరు మీ సహజ స్వభావాన్ని అనుసరిస్తే, ఆనందంగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.