తన జీవితంలో ఒక్క క్షణం కూడా ఆనందం తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటారా?  అంతర్గతానందం,  బాహ్యానందం అని వేరు వేరుగా ఉంటాయా? ఒకసారి పొందిన ఆనందాన్ని మన జీవితంలో శాశ్వతం చెసుకోవడం ఎలా ? ఈ ప్రశ్నలకి సద్గురుసమాధానాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!  


తన జీవితంలో ఒక్క క్షణం కూడా ఆనందం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కానేకాదు, ప్రపంచంలోని అత్యంత బాధామయ వ్యక్తికి కూడా ఆనందం అంటే ఏమిటో తెలుసు. అతను ఆనందాన్ని పొందలేడని కాదు. అతను బాధను ఎలా అయితే పొందగలడో, అలాగే ఆనందాన్ని కూడా పొందగలడు.

ప్రస్తుతం ఆ భాధామయ వ్యక్తి సమస్య ఏమిటంటే అతను దాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. నిజానికి అతను చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఆనందాన్ని కోల్పోయాడు. అవునా, కాదా? మనుషులు ఎంతో బాధలో ఉండటానికి ఒక కారణం, 'నిన్న ఎంతో బాగుండింది, కానీ ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది?’ అని అనుకోవటమే. అది వారి బాధని అనేక రెట్లు పెంచుతుంది, అవునా, కాదా? అంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో, కనీసం ఒక్క క్షణమైనా, ఆనందాన్ని అనుభవించారు.

మిమ్మల్ని మీరు ఒక్క క్షణమైనా ఆనందపరుచుకోగల సామర్ధ్యం మీకు ఉందంటే, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆనందపరుచుకోగల సామర్ధ్యం కూడా మీకు ఉంటుంది

మిమ్మల్ని మీరు ఒక్క క్షణమైనా ఆనందపరుచుకోగల సామర్ధ్యం మీకు ఉందంటే, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆనందపరుచుకోగల సామర్ధ్యం కూడా మీకు ఉంటుంది. నేను “మిమ్మల్ని మీరు” అని ఎందుకు అంటున్నానంటే, మిమ్మల్ని మీరే బాధపెట్టుకోగలరు లేదా ఆనందపరుచుకోగలరు. మీరు అనుభూతి చెందేది మీలోనే, మీ బయట కాదు. మీరు ఆనందంగా ఉండటానికి మీ అవగాహనలో రావలసిన ప్రాధమిక మార్పు ఇదే.

అంతర్గతానందం ఎలా పొందాలని అందరూ అడుగుతారు. నేను వారిని అడుగుతాను, 'మీకు బాహ్యనందం అంటే ఏమిటో తెలుసా?' అని. మద్యం తీసుకోవటం వలన మీకు ఆనందంగా అనిపించి ఉండవచ్చు. మీరు దాన్ని ‘బాహ్య ఆనందం’ అని అనుకుంటుండవచ్చు. కానీ మీరు ఏమి చేసినా సరే, ఎప్పుడూ మీ లోపలే మీకు ఆనందంగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ మీలోనే అనిపిస్తుంది, అవునా, కాదా? ఎప్పుడూ మీ బయట కాదు.

మీరు ఇప్పుడు బాధగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, మీరు ఆనందపడకుండా, ఆనందాన్ని వెతుకుతున్నారు. మీరు ఆనందాన్ని అనుభూతి చెందేది మీలోనే అని అర్ధం చేసుకోకుండా, ఏదో ఆనందం బయట ఉన్నట్లు మీ శక్తినంతటినీ బయట ఉన్నవాటి మీద కేంద్రీకరిస్తున్నారు.

మీరు సంతోషంగా లేకపోవటానికి కారణమేమిటంటే మీ ఆనందానికి ఆధారమైన 'మీ' నుండి మీరు దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆనందాన్ని వీధిలో ఎక్కడో వెతుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారన్న వాస్తవమే బాధని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆనందం ఇక్కడ, అంటే మీ లోపల ఉంది, కానీ మీరు ఎక్కడికో వెళుతున్నారు. మీరు దాని నుండి దూరంగా వెళుతున్నారు.

మీరు ఆనందాన్ని పొందగలరు. కాకపోతే మీరు దాన్ని కొన్ని క్షణాలు మాత్రమే సృష్టించుకుంటున్నారు. మిగతా సమయమంతా మీరు ఎంతో బాధను సృష్టించుకుంటున్నారు.

మీలో మీకు కావలసిన విధంగా ఒక్క క్షణాన్నైనా సృష్టించుకోగల సామర్ధ్యం మీకు ఉంటే, మీకు కావలసిన విధంగా మరొక క్షణాన్ని సృష్టించుకోగల సామర్ధ్యం మీలో ఉండదా? మరొకటి, మరొకటి, ఇంకొకటి.. అదృష్టవశాత్తు, జీవితమంటే ఇంతే, ఒకసారి ఒక్క క్షణమే. క్షణాలు ఒక్కసారే గుంపుగా వచ్చి, మీ మీద దాడి చేయట్లేదు. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగానే వస్తున్నాయి. మీకు ఈ క్షణంలో ఆనందంగా ఉండడం ఎలానో తెలిస్తే, మీరు ఇక ఆపై ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. అది ఎలానో మీకు తెలియకపోతే, మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.