మీకు మీరు ఆనందంగా లేకుండా ఇతరుల ఆనందం కోసం పని చేస్తే అది వారికి ఆనందాన్నికలిగిస్తుందా? మనమే సంతోషంగా లేకుండా ఇతరులను సంతోష పెట్టడం సాధ్యమా?ఈ ప్రశ్నలకి సద్గురు ఏమంటున్నారో  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


ఏది సృష్టించాలో తెలియకపోతే మీరు దానిని ఎలా సృష్టిస్తారు? మీరే ఆనందాన్నిఅనుభూతి చెంది ఉండకపోతే, మీరు ఇతరులకి ఆనందాన్ని ఎలా సృష్టిస్తారు?

ఉదాహరణకు, ఇప్పుడు నేను చాలా బాధలో ఉండి, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాను కానీ, మిమ్మల్ని సంతోషపెట్టటానికి మీ కోసం పని చేస్తానని నేనంటాను. అప్పుడు మూడు రోజుల్లో ఆశ్రమం ఒక శోక సముద్రంలా మారడం మీరు చూస్తారు. ఇప్పుడు కూడా నేను పనితో సతమతమై పోతున్నాను, కానీ అది నేను ఆనందంగా చేస్తున్నాను. ఎవరి కోసమూ సేవగా చెయ్యట్లేదు. చేయాల్సిన పనులను నేను చేస్తున్నాను, అంతే. అందువల్ల ఇది ఎవరికీ భారం కాదు.

నేను రోజూ ఏడుస్తూ బాధపడుతూ, చనిపోయేదాకా అలాగే ఉంటే, అది పక్కవారందరికీ ఎంత బాధ కలిగిస్తుందో మీకు తెలుసా? నేను ఏమీ చేయకపోతే, వారు తమకు తోచిన విధంగా అర్థం పర్థం లేని పనులు చేస్తూ బాగానే ఉంటారు. అలాగే మీకు మీరు ఆనందంగా లేకుండా ఇతరుల ఆనందం కోసం పని చేస్తే, అది అందరికీ మరింత బాధని కలిగిస్తుంది.

చాలా కుటుంబాలలో, తల్లిదండ్రులనబడే చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ‘మేము ఎంత బాధపడ్డా ఫరవాలేదు, మా పిల్లలు సుఖంగా ఉండాలి!’ అని వారు అంటారు. వారి పిల్లలకి వారు నిరంతరం బాధపడే ఉదాహరణలని ఇస్తూంటే వారు ఆనందంగా ఎలా ఉంటారు? మీరు ముప్పైలలో చేసేది మీ పిల్లలు ఇరవైలలోనే చేస్తారని తెలుసుకోండి!మీకు ముప్పై ఏళ్ళ వయసులో ఏడుపుముఖాలు ఉంటే, మీ పిల్లలకి ఇరవైఏళ్ళ వయసులో ఏడుపు ముఖాలు ఉంటాయి.

మీరు ఆనందాన్నిఅనుభూతి చెంది ఉండకపోతే, మీరిక మిగతా వారందరికీ ఆనందాన్ని ఎలా సృష్టిస్తారు?

ఏ విషయంలోనైనా ఇలానే ఉంటుంది. మీరు పద్దెనిమిదేళ్ళ వయసులో పొగ త్రాగితే, మీ కొడుకు ఎనిమిదేళ్ళకే మొదలుపెడతాడు. ఉదాహరణకి, మీ నాన్నగారు పొగ త్రాగలేదు, అయినా కూడా మీరు పద్దెనిమిదేళ్ళ వయసులో పొగ త్రాగడం మొదలుపెట్టారనుకోండి. మిమ్మల్ని చూసి, చూసి మీ కొడుకు ఎనిమిదేళ్ళు లేదా పదేళ్ళ వయసుకే మొదలుపెడతాడు. ఎందుకంటే మీ కొడుకు మీ కన్నా ఎప్పుడూ ఒక అడుగు ముందుంటాడు. పిల్లలు దాదాపు ప్రతీ విషయం ఉదాహరణల ద్వారానే నేర్చుకుంటారు.

మీరు ఆనందానికి ఒక ఉదాహరణగా ఉండకుండా, కేవలం దాని గురించి మాట్లాడితే, దానికి అర్ధం లేదు. దానికి నిజంగా అర్ధమే లేదు. అది ఒక గ్రుడ్డి వాడు వెలుగు గురించి మాట్లాడినట్లు ఉంటుంది. ఒక గ్రుడ్డి వాడిని లైటు వేయమని అడగండి. మీరు అతనికి స్విచ్చు చూపిస్తే అతను దానిని నొక్కవచ్చు, కానీ మీరు అతనిని వెలుగుని సృష్టించమంటే అతను ఎలాంటి వెలుగుని సృష్టిస్తాడు?

అతను ఎప్పుడూ వెలుగుని చూడకపోతే, వెలుగు గురించి అతనికేమి తెలియకపోతే, మీరు ఒక శబ్దం చేసి అదే వెలుగు అంటే అతను నమ్ముతాడు. ఆనందం గురించి కూడా మనుషులు ఇదే చేస్తున్నారు; వారికి ఆనందం అంటే ఏమిటో తెలియదు. వారికి పెళ్లి అంటే ఆనందం అని చెప్పారు. 'సంసారం సుఖం'అన్నారు. కానీ, జనాలు తమ సంసార జీవితంలో తామేమి ఆనందమేమి పొందకపోయినా, తమ పిల్లలకి పెళ్లి చేయాలని ఎంత తాపత్రయ పడతారో చూడండి.

వారి పిల్లలకి పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారో వారికే తెలియదు, కానీ వారు వారి పిల్లలకి పెళ్లి చేయాలి. ఎందుకంటే అది ఆనందం అని వారు నమ్ముతారు. ఇది గ్రుడ్డి వాడు వెలుగు గురించి మాట్లాడడం వంటిదే, అవునా, కాదా? ఆనందం లేని మనిషికి ఆనందం అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది?

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.