పిల్లలు మన జీవితంలోకి రాగానే మనం వారికన్నీ నేర్పించాలని తెగ తాపత్రయ పడుతూ ఉంటాము. నిజానికి మనం వారికి నేర్పించేది ఏమైనా ఉందా, లేక మనమే వారి దగ్గర నేర్చుకోవాలా? దీని గురించి సద్గురు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి!


ఒక శిశువు తమ జీవితంలోకి ప్రవేశించగానే, చాలామంది, ‘ఇక మనం బోధించే సమయం వచ్చింది’ అని తలుస్తారు. ఒక శిశువు మీ జీవితంలోకి ప్రవేశిస్తే, మీరు మరచిపోయిన జీవితాన్ని తిరిగి నేర్చుకునే సమయం వచ్చినట్లు అర్థం. మీరొక చెక్క బొమ్మలాగా అయిపోయారు. అప్పుడు, ఈ బుజ్జి ఆనందాల మూట మీ జీవితంలోకి ప్రవేశించింది. ఇపుడు, తెలియకుండానే, మీరు నవ్వటం మొదలుపెట్టారు. పాడటం మొదలు పెట్టారు. సోఫాల క్రింద పాపాయితో బాటు పాకసాగారు. పాపాయి వల్లనే, జీవితం జీవితంలాగా ఉంది. మీ వల్ల కాదు. జీవితం విషయం తీసుకుంటే, మిమ్మల్ని, మీ పాపాయిని పోల్చి చూద్దాం. 24 గంటల్లో, ఎవరు ఎక్కువ ఉల్లాసభరితంగా ఉన్నారు? మీ పాపాయి. అవునా? మరి జీవితం గురించి ఎవరిని సంప్రదించాలి? మీ పాపాయినే కదా! కాబట్టి, అది మీరు జీవితాన్ని నేర్చుకునే సమయం. జీవితాన్ని బోధించే సమయం కాదు.

మీరు పిల్లలను పెంచే అవసరం లేదు. వారు తమంత తాము ఆనందపు మూటలు. మీ ప్రభావం మీ పిల్లల మీద పెద్దగా ఉండకుండా చూసుకోండి. ఇక వారు హాయిగా ఉంటారు. 

మీరు పిల్లలను పెంచే అవసరం లేదు. వారు తమంత తాము ఆనందపు మూటలు. మీ ప్రభావం మీ పిల్లల మీద పెద్దగా ఉండకుండా చూసుకోండి. ఇక వారు హాయిగా ఉంటారు. మీ పిల్లవాని చుట్టూ ప్రేమాదరణలతో నిండిన వాతావరణాన్ని సృష్టించండి. ఇకవారు చక్కగా పెరుగుతారు. ఇది మీ తోటలో ఒక మొక్కను పెంచటం వంటిదే. వాతావరణం సరిగ్గా ఉండేటట్లు మీరు చూసుకుంటే చాలు. మొక్క తన సంపూర్ణ సామర్థ్యంతో పెరుగుతుంది. ప్రతిరోజూ, అదే పనిగా మీరు దాని జోలికి పోతూ ఉంటే కనుక, అది పెరగనే పెరగదు.

కాబట్టి, మీరు మీ పిల్లవాణ్ణి చక్కగా పెంచాలనుకుంటే, మొట్టమొదటి విషయం, మీరు ఆనందంగా ఉండి తీరాలి. ప్రస్తుతం, మీ అంతట మీరు ఎలా ఆనందంగా ఉండాలో మీకు తెలియదు. ఆందోళన, కోపం, భయం, ఆదుర్దా, అసూయ, వీటిపై ప్రతిరోజూ మీ ఇంట్లో ఒక ప్రదర్శన జరుగుతూ ఉంది. మీ పిల్లవాని ముందు ఈ విషయాలే ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. అప్పుడు అతడు అవే నేర్చుకుంటాడు. మీ పిల్లవాణ్ణి చక్కగా పెంచాలనే ఉద్దేశ్యం మీకు నిజంగా ఉంటే, ముందు మీరుండే తీరును మీరు మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు పరివర్తనం చెందించుకునే సామర్ధ్యం మీకు లేకపోతే, ఇక మీ పిల్లవాణ్ణి పెంచటం అనే ప్రశ్నకు తావెక్కడుంది?

పిల్లవాణ్ణి ప్రేమ పూర్వకంగా పెంచటం అంటే అతనికి అడిగినదల్లా ఇవ్వటమే అని చాలా మంది అర్థం చేసుకుంటారు. మీ పిల్లవాణ్ణి కొంచెం విజ్ఞతతో గమనించండి. అప్పుడు అతడు అడిగినదల్లా తెచ్చి ఇవ్వటం ఒట్టి మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది. దానికి మీరు 'ప్రేమ' అని పేరు పెట్టారు.

మీరు చేయవలసిందంతా, ఇంట్లో ప్రేమాదరణలతో నిండిన వాతావరణాన్ని కల్పించటమే. అదొక్కటే మీ పని. ఆ ఒక్కటి ఖచ్చితంగా చూసుకోండి మీరు. కోపంగా ఉండటం అంటే ఏమిటో, దీనంగా ఉండటం అంటే ఏమిటో, భంగపడటం అంటే ఏమిటో, మీ పిల్లలు ఎప్పటికీ చూడకూడదు. మీ ఇల్లు ప్రేమానందాలతో నిండి ఉండేలా చూడండి. ఇక వారు అద్భుతంగా పెరుగుతారు. మీ పని అలాంటి వాతావరణాన్ని కల్పించటమే. మీ అనవసరపు సోదినంతా వాళ్ళకు బోధించటం కాదు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండేలా చూసుకుంటే చాలు. వాళ్ళు చక్కగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులలో పడవేసినా, వాళ్ళు ఉల్లాసవంతంగా జీవించగలగాలి. ఆ రకంగా వాళ్ళను పెంచండి. వాళ్ళు పెరగవలసిన తీరు అదే. అవునా, కాదా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు