మీరు ఆనందాన్ని ఎందుకు వెతుకుతున్నారు? అసలు మీరు ఆనందం ఎందుకు వెతుకుతున్నారో మీకు తెలియదు. నేను గానీ, మరొకరు గానీ మిమ్మల్ని ఆనందం వెతకమని చెప్పలేదు. మీరు నా వల్లనో, మరొకరి వల్లనో ఆనందాన్ని వెతకటం లేదు. అసలు విషయమేమిటంటే మీలోని జీవం నిరంతరం ఆనందాన్ని కోరుకుంటోంది, అందుకే మీరు ఆనందాన్ని వెతుకుతున్నారు. ఇది ఒక ఆలోచనో లేదా వేదాంతమో కాదు.

ఆనందం మీ ఉనికి యొక్క మౌలిక వ్యక్తీకరణ. మామిడి చెట్టు నిరంతరం తియ్యదనాన్ని తయారు చేయాలనుకుంటుంది, దానికి అది ఎవరూ నేర్పలేదు. ఎందుకంటే దాని స్వభావం అటువంటిది. అలానే ఎల్లప్పుడూ ఆనందాన్ని వెతుకుతూ ఉండటం అనేది మానవ స్వభావం.

మీరు ఎన్ని విధాలుగా మీ మనసుని పాడు చేసినా కూడా, మీరు ఇంకా ఆనందాన్ని వెతుకుతున్నారు, అవునా, కాదా? అది మీకు దొరికిందా, లేదా అన్నది ప్రశ్నార్ధకం, కానీ మీ ప్రయత్నం ప్రశ్నార్ధకం కాదు. ప్రతి మనిషీ ఆనందాన్ని వెతుకుతున్నాడు. ఎలా అన్నదానితో సంబంధం లేదు. మీరు డబ్బు, అధికారం, విలాసం, మద్యం, దేవుడు లేదా స్వర్గం, ఇలా దేనికోసం వెదికినా, అది అంతా ఆనందం కోసమే.

 

మీరు చేసేదంతా ఆనందం కోసమే చేస్తున్నప్పుడు, దానిని ఎన్నో ఇతర మార్గాల ద్వారా చేరుకోవాలని ప్రయత్నించడం ఎందుకు? దానిని నేరుగా చేరుకోవాలని ఎందుకు ప్రయత్నించ కూడదు?

కాబట్టి, నేను అడుగుతున్నది ఏమిటంటే, మీరు చేసేదేదంతా ఆనందం కోసమే చేస్తున్నప్పుడు, దానిని ఎన్నో ఇతర మార్గాల ద్వారా చేరుకోవాలని ప్రయత్నించడం ఎందుకు? దానిని నేరుగా చేరుకోవాలని ఎందుకు ప్రయత్నించ కూడదు? మీరు ఇక్కడికి రావాలనుకుంటే, ప్రపంచం చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చే బదులు నేరుగానే ఇక్కడికి రావచ్చు కదా?

ఒక పర్యాటకుడు ఇక్కడ ఒక స్ధానిక పిల్లవాడిని ఈశా యోగా సెంటర్ ఇక్కడికి ఎంత దూరంలో ఉందని అడిగాడు. ఆ పిల్లవాడు చెప్పాడు ‘మీరు వెళ్తున్న దారిలో వెళితే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మైళ్ళ దూరంలో ఉంది, కానీ మీరు వెనక్కి తిరిగితే అది కేవలం నాలుగు మైళ్ళ దూరంలోనే ఉంది”. మీరు వెనక్కి తిరిగితే అంటే అంతర్ముఖులైతే, మీ శరీరంలోకి చొచ్చుకుపోయి, ఆనంద మూలాన్ని తాకేందుకు కేవలం నాలుగు పొరలు మాత్రమే ఉన్నాయి. అదే మీరు ఇంకో దారిలో వెళితే, అంటే బహిర్ముఖులైతే, అది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మైళ్ళు కావచ్చు లేక ఇంకా ఎక్కువే కావచ్చు. ఇక మీరు ఏ దారిలో వెళుతారనేది మీ ఇష్టం.

నేరుగా ఉన్న మార్గాన్ని తీసుకోకపోవడంలో తప్పేమీ లేదు, కాకపోతే అది తెలివి తక్కువతనం. తెలివితక్కువగా ఉండటం నేరమేమీ కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.