మనమందరం ఆనందాన్నికోరుకుంటాం. 'ఇది లభిస్తే ఆనందంగా ఉంటాను, అది లభిస్తే ఆనందంగా ఉంటాను' అనుకుంటూ ఎంతో తాపత్రయపడి వాటిని సాధిస్తాము. ఐనప్పటికీ మళ్ళీ మళ్ళీ దుఖానికి గురవుతూనే ఉంటాము. దీనికి కారణమేమిటో  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


"అంతర్గత ఇంజనీరింగ్ లేదా అంతర్గత విజ్ఞానం" అని మనం అనే శాస్త్రవిజ్ఞానం లేదా జ్ఞానం ఆనందాన్ని మన జీవిత గమ్యంగా చూడటం గురించి కాదు, ఆ విజ్ఞానం మనం ఆనందాన్ని మన జీవితాలకు ఆధారంగా చూడటం గురించి.

మీ జీవిత ఏకైక లక్ష్యం ఆనందమేనా? కాదు! ఆనందం మీ లక్ష్యం కాదు; అది మీ జీవితపు మొదటి గడి. ఆనందం ఉన్నప్పుడు మాత్రమే, మీ జీవితంలో మిగతా విషయాలకు ఆస్కారం ఉంటుంది లేకపోతే ఎప్పుడు దుఃఖమనే 'భూతం' మీ మీద దాడి చేస్తుందోనన్న నిరంతర భయంతో మీరు జీవిస్తారు. మీకు ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు, జీవన గమనం అలాగే ఉంటుంది.

బాహ్యంగా, శారీరకంగా ఏమైనా కావచ్చు. ఈ క్షణం మీరు ఉనికిలో ఉన్నారు, కాని మరుక్షణం మీరు ఆవిరైపోవచ్చు. అలా జరిగే అవకాశం ఉంది. అలా జరగాలని మనం కోరుకోవటం లేదు, కానీ ఆ అవకాశం ఉంది(నవ్వు). బాహ్యంగా మీకు జరిగే దానికన్నా, మీకు ఏమవుతుందోనని అనుకుంటూ మీలో మీరు అనుభవించే ఆ భయం, ఆ ఆందోళనలే మీలో దుఃఖం, ఆతృత, ఒత్తిడిలుగా వ్యక్తమవుతాయి. వీటిని మీరు ఎలా అదుపు చేసుకుందామనుకున్నా, వాటి వల్ల మీరు మళ్ళీ మళ్ళీ దుఃఖానికి గురవుతూనే ఉంటారు.

ఒకసారి ఒక కిండర్ గార్టెన్ టీచరు క్లాసులోకి రాగానే, క్లాసు మధ్యలో ఎవరో కావాలని పోసిన మురికి నీళ్ళు కనిపించాయి. ఆమె దాన్ని చూసి, “ఇది ఎవరు చేసారు?” అని అడిగింది. ఆ చిన్న గుంటలు ఒక్కరూ జవాబివ్వలేదు, ఎందుకంటే వారి మధ్య ఉన్న అవగాహన అలాంటిది.

ఆ టీచరు మళ్ళీ అడిగింది కానీ ఎవరూ జవాబివ్వలేదు. అప్పుడు ఆమె ఇంకా అడిగి లాభం లేదనుకుని, ”పిల్లలూ ఇప్పుడు మనమందరం కళ్ళు మూసుకుని ఈ పని చేసినవారికి శుభ్రం చేసి, తిరిగి వెళ్లి కూర్చోటానికి ఐదు నిముషాలు సమయాన్ని ఇద్దాం. ఇది ఎవరు చేసారో ఎవరికీ తెలియక్కర్లేదు, కానీ ఇది శుభ్రం అవ్వాలి!” అంది.

అందరూ కళ్ళు మూసుకున్నారు, అప్పుడు టీచర్‌కి అడుగుల చప్పుడు, బకెట్టు శబ్దం ఇంకా వేరే శబ్దాలు వినిపించాయి. ఆమె తగినంత సమయం ఇచ్చింది. కాసేపటికి వాళ్ళు మళ్ళీ వెనక్కి పరిగెడుతున్నఅడుగుల చప్పుడు, కూర్చున్న చప్పుడు వినిపించాయి. అంతా ప్రశాంతంగా ఉంది, అంటే పని అయిపోయిందని అర్ధం. అందరూ కళ్ళు తెరిచారు, అయితే వాళ్ళు అక్కడ మరిన్ని మురికి నీళ్ళను చూసారు. దాని పక్కనే రాసి ఉంది “భూతం మళ్ళీ దాడి చేసింది!” అని.

ప్రతి దశలో మీరు అనుకుంటారు 'అసలైంది ఇదే అని, కానీ జీవితంలో మళ్ళీ మళ్ళీ మరేదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే మీరు అసలు మీ అస్థిత్వంతో అనుసంధానమై లేరు.

కాబట్టి, మీరు జీవితంలోని ప్రతి దశలో, ప్రతిసారీ అనుకుంటారు, ‘ అబ్బా నేను ఈ ఒక్క పనీ పూర్తి చేస్తే చాలు, నా జీవితం సుఖమయం అవుతుంది!’ అని, కానీ కొంత సమయం తర్వాత, మళ్ళీ అలానే అనిపిస్తుంది. మీరు ’నా పెళ్లి ఈ వ్యక్తితో అయితే చాలు, నా జీవితం సుఖమయం’ అని అనుకున్నారు, కానీ ఇంకోటేదో కావాలన్న కోరిక త్వరలోనే ఘోరంగా తిరిగి దాడి చేస్తుంది.
ప్రతి దశలో మీరు అనుకుంటారు ’అసలైంది ఇదే'’ అని, కానీ జీవితంలో మళ్ళీ మళ్ళీ మరేదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది, అవునా, కాదా? సృష్టిలో ఏదో లోపం ఉండటం వలన ఇలా అనిపించటం లేదు, మీరసలు మీ  అస్థిత్వంతో అనుసంధానమై లేకపోవడం వల్ల, మీరు సేకరించిన అల్పమైన వాటితో గుర్తించబడుతున్నందు వల్ల అలా అనిపిస్తుంది. మీరు కేవలం ఒక సేకరించుకున్నకుప్ప అయ్యారు, మీకంటూ ఒక సొంత ఉనికి లేనే లేదు. మీరు మళ్లీ మళ్ళీ దు:ఖం అనుభవించటానికి అసలు కారణం ఇదే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు