భారత దేశ ప్రస్తుత జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ.  కానీ ఇంతమందికి సరిపోయేంత భూమి, నీరు, పర్వతాలు, కనీసం ఆకాశం కూడా లేదు.  ఈ క్షణాన,  60% శాతం కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు  శరీర నిర్మాణం సరిగా  లేదు.  వారి శరీరం, మెదడు పూర్తి  స్థాయికి ఎదగడం లేదు.   కారణమేమిటంటే గర్భస్త శిశు దశ నుంచి వారికి తగిన పోషణ అందడం లేదు.  35% శాతం మంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు.  అందువల్ల  వారు ఎప్పటికి సరిగా ఎదగలేరు.  ఏ పిల్లలకైతే,  బాల్యదశలో పోషకాహార సమస్యలుంటాయో, ఎవరైతే సరైన బరువుతో పుట్టరో, వారికి  మీరు ఏమి చేసినా, వారి జీవితంలో వారి శరీరము, మెదడు పరిపూర్ణంగా ఎదగవు. అంటే, మనం ఒక పరిపుష్టి లేని సమాజాన్ని తయారు చేస్తున్నాము. కాని, మాట్లాడుతున్నది మాత్రం మనది  21వ శతాబ్దపు అత్యంత శక్తిమంత దేశమని! ఎంత హాస్యాస్పదమైన విషయం ఇది.

జీవనానికి ఒక సమగ్రమైన తీరు తెన్నూ లేదు.  మనం సూత్రాల గురించి, వ్యవస్థ గురించి, ఇంకా పుస్తకాలలోని  సిద్దాంతాల గురించి చర్చిస్తాము.  అది కాదు మనకు అవసరమైనది! మనం మన ప్రస్తుత స్థితిని గమనించి దానికి తగినట్టు ప్రవర్తించాలి.

భారతదేశం  ప్రస్తుతం ఎదుర్కుంటున్న నీటి సమస్యని  మీరు గమనిస్తే,  1947లోని  తలసరి పరిమాణంలో  కేవలం 18% శాతం మాత్రం ప్రస్తుతం మనకు లభిస్తుంది. ఇది ప్రగతి  కాదు, అభివృద్ధి కాదు. ఈ నాటికే,  తమిళనాడు లోని చాల ఊర్లలోని ప్రజలు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు.  వీరు ఒకప్పుడు, ఏమైనా  తిన్నా, తినక పోయిన, స్నానం మాత్రం తప్పనిసరి అని భావించిన వారే కదా ? మన వాతావరణానికి అది అవసరం.  కానీ ఇప్పుడు ప్రజలు స్నానాన్ని కూడా  చేయలేకపోతున్నారు.  ఇది అభివృద్ధి కాదు. ఇది శ్రేయస్సు కాదు.  మీరు రోజు విడిచి రోజు నీరు తాగాల్సిన పరిస్థితి కూడా వచ్చే సమయం రావొచ్చు.

అసలు విషయానికి వస్తే, జనాభా విషయంలో మనకున్న ఛాయస్ ఒకటే. అదే ముందు జాగ్రత్తతో  అలోచించి జనాభాని నియంత్రించడం! లేకపోతే ప్రకృతే ఆ పనిని  నిర్దయతో చేస్తుంది.నా దృష్టిలో మనం మనుషులమైతే,  జ్ఞానంతో ప్రవర్తించి అటువంటి క్రూరమైన పరిస్థితులు మనకు ఎదురుకాకుండా చూసుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు